ఈ రేసులో ఇండీ రేసింగ్‌ అడుగు

– ఎఫ్‌ఐఎం ఈ ఎక్స్‌ప్లోరర్‌లో తొలిసారి మన జట్టు
– సీజన్‌2 ఫైనల్స్‌కు వేదిక కానున్న భారత్‌
నవతెలంగాణ – హైదరాబాద్‌
ఫార్ములా ఈ రేసుతో అంతర్జాతీయ ఎఫ్‌1 స్థాయి రేసింగ్‌ అనుభూతిని ఆస్వాదించిన భారత అభిమానులు.. ఇప్పుడు మోటార్‌సైకిల్‌ రేసింగ్‌లోనూ సరికొత్త అనుభూతిని పొందనున్నారు. ఈ ఏడాది నుంచి అంతర్జాతీయ మోటార్‌సైకిల్‌ సమాఖ్య (ఎఫ్‌ఐఎం) ఈ- ఎక్స్‌ప్లోరర్‌లో తొలిసారి భారత జట్టు పోటీపడనుంది. ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ రేసింగ్‌లో హైదరాబాద్‌కు చెందిన కంకణాల స్పోర్ట్స్‌ గ్రూప్‌ ఓ జట్టును సొంతం చేసుకుంది. ఎఫ్‌ఐఎం ఈ ఎక్స్‌ప్లోరర్‌ సీజన్‌2లో కంకణాల స్పోర్ట్స్‌ గ్రూప్‌ నుంచి ఇండీ రేసింగ్‌ జట్టు బరిలోకి దిగనుంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో కంకణాల స్పోర్ట్స్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు అభిషేక్‌ రెడ్డి కంకణాల ప్రకటించారు. ఎఫ్‌ఐఎం ఈ ఎక్స్‌ప్లోరర్‌ సహ వ్యవస్థాపకురాలు కేరిన్‌ ముంటెతో కలిసి ఇండీ రేసింగ్‌ జట్టును ఆవిష్కరించారు. ఎఫ్‌ఐఎం ఈ ఎక్స్‌ప్లోరర్‌లో ఇండీ రేసింగ్‌ పదో జట్టుగా నిలువనుంది. ఈ ఏడాది రేసింగ్‌ సీజన్‌ ఫిబ్రవరి నుంచి ఆరంభం కానుంది. జపాన్‌, నార్వే, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌లు తొలి నాలుగు రేసులకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. సీజన్‌ ఫైనల్స్‌కు ఏడాది చివర్లో భారత్‌ వేదికగా నిలువనుంది.
హైదరాబాద్‌లో ఫైనల్స్‌!: ‘ఎఫ్‌ఐఎంతో తొమ్మిదేండ్లకు కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నాం. భారత్‌ నుంచి తొలి రేసింగ్‌ జట్టుగా ఇండీ రేసింగ్‌ నిలువనుంది. మన దగ్గర ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ రేసింగ్‌తో పర్యావరణహిత వాహనాలను సైతం ప్రోత్సహించేందుకు అడుగు పడుతుంది. ఈ నవంబర్‌, డిసెంబర్‌లో హైదరాబాద్‌ వేదికగా ఈ ఎక్స్‌ప్లోరర్‌ రేసింగ్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌, గోల్ఫ్‌ లీగ్‌లో మా భాగస్వామ్యం ఆ క్రీడలకు గొప్ప దన్నుగా నిలిచింది. రేసింగ్‌లోనూ అదే తరహా ఆదరణ ఆశిస్తున్నాం. భారత రేసింగ్‌ అభిమానులు ఇండీ రేసింగ్‌ జట్టుకు మద్దతు ఇస్తారనే విశ్వాసం ఉంది’ అని కంకణాల అభిషేక్‌ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మాజీ వరల్డ్‌ చాంపియన్లు ఐశ్వర్య, శాండ్ర గోమెజ్‌ తదితరులు పాల్గొన్నారు.