సాదాబైనామాలపై సవతి ప్రేమ

సార్లు రారు.. సమస్య తెగదు
– ఎదురుచూస్తున్న రైతులు
– కొత్త చట్టం ప్రకారం కలెక్టర్‌ పరిశీలించాకే
– పాత చట్టంలో తహశీల్దార్‌కు
– పట్టించుకోని ప్రభుత్వం
– ఆందోళనలో అన్నదాతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘సాదాబైనామా ద్వారా 30ఏండ్లక్రితం ఎకరా భూమి కొనుగోలు చేశాం. తహశీల్దార్‌ కార్యాలయం నుంచి ప్రొసిడింగ్స్‌ కూడా ఇచ్చారు. అమ్మిన వ్యక్తి చనిపోవడంతో వాళ్ల వారసులు తమ పేరు మీద విరాసత్‌ చేయిం చుకున్నారు. తహశీల్దార్‌, ఆర్‌డీఏ, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయాయి. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఆఫీసుల చుట్టు తిరగడం కంటే ఆత్మహత్య చేసుకోవడమే మేలు’ అని రంగారెడ్డిజిల్లా కడ్తాల్‌ మండలం చరికొండ గ్రామానికి చెందిన అనిల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య ఒక్క అనిల్‌దే కాదు. రాష్ట్రంలో 9.24లక్షల మంది దరఖాస్తుదారుల ఆవేదన ఇది. వారి అప్లికేషన్లన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. కొన్నేండ్లుగా ఈ సమస్యను పరిష్కరించకపోవడంతో వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. భూముల విషయంలో హత్యా యత్నాలు కూడా జరిగిన దాఖలాలు ఉన్నాయని పలువురు బాధితులు వాపోతున్నారు.
సాదాబైనామా ఓ రిజి స్ట్రేషన్‌ కాని భూ లావా దేవీ. కేవలం తెల్ల కాగితాల ద్వారా భూమి కొనుగోలు జరిగితే అది సాదాబై నామా కొనుగోలే అవు తుంది. ఇలాంటి రిజిస్ట్రేషన్‌ కాని కొనుగోలుపై ఏదైనా పట్టా పొందాలంటే వాటిని రెగ్యుల రైజేషన్‌ చేయించు కోవాలి. అయితే ఈ సాదా బైనామా కేసులు పరిష్కా రం కావా లంటే క్షేత్రస్థాయి లో జిల్లా కలెక్టర్‌ పరిశీలించి తహశీల్దార్‌ కు సిపార్సు చేస్తే ఆయన 13-బి సర్టిపికెట్‌ జారీ చేస్తారు. కానీ వెళ్లి పరిశీలించరు. ఆ సమస్య పరిష్కా రానికి నోచు కోదు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఫలితంగా సాదాబైనా మాల పరిష్కారం కోసం రైతులు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఏండ్ల తరబడి సమస్య పరి ష్కారం కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు.
దరఖాస్తులు స్వీకరించి..
రాష్ట్రంలో రెండు సార్లు సాదాబైనామాల క్రమబద్దీ కరణకు అవకాశమిచ్చారు. కానీ దరఖాస్తులు స్వీకరించి వదిలేశారు. 2 జూన్‌ 2014లోపు తెల్లకాగితాలపై రాసుకున్న లావాదేవీల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు ఆహ్వానించారు. 2.24లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ వాటిని పరిష్కరించలేదు. 2020లో కొత్త రెవెన్యూచట్టం అమల్లోకొచ్చింది. సర్కార్‌ పాత ఆర్‌ఓఆర్‌ చట్టం-1971కి సవరణలు చేసి ఆర్‌ఓఆర్‌ చట్టం-2020ని అమల్లోకి తచ్చింది. అక్టోబర్‌ 29న కొత్త చట్టం అమల్లోకొచ్చింది. మరోసారి అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 10 వరకు సాదాబైనామాల రెగ్యులరైజేషన్‌కు అవకాశం కల్పించారు. ఈ 12 రోజుల్లోనే 7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 9.24లక్షల దరఖాస్తులకుగాను 2.24 లక్షల దరఖాస్తులను పరిష్కరించేందుకు హైకోర్టు సైతం గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. అయినా ప్రభుత్వం వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడంలేదు.
కలెక్టర్‌ రారు..పరిశీలించరు..
ఆర్‌ఓఆర్‌-1971 చట్టం ప్రకారం సాదాబైనామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతోపాటు పరిష్కరించే అధికారం తహశీల్దార్‌కు ఉండేది. కాని కొత్త చట్టంలో స్వయంగా కలెక్టరే పరిశీలించి తహశీల్దార్‌కు సిపార్సు చేస్తే పరిష్కరించేలా నిర్ణయించారు. జిల్లా పరిపాలనలో తీరికలేకుండా ఉండే కలెక్టర్‌కు సాదాబైనామాలను పరిశీలించే సమయమెక్కడిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సర్కార్‌ అనుకుంటే…
భూ వివాదాలు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో సాదాబైనామాల ఊసేలేదని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం వీటి పరిష్కారానికి ఏలాంటి నియమ, నిబంధనలను రూపొందించలేదని చెబుతున్నారు. సాదాబైనామాలను కలెక్టర్‌ పరిశీలించే అంశాన్ని సవరించి తిరిగి తహశీల్దార్‌కే అప్పగిస్తే బాగుంటుందని బాధితులు కోరుతున్నారు. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే వీటిని పరిష్కరించడం పెద్ద సమస్య కాదని అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్య పరిష్కారమైతే లక్షలాది మంది సన్న, చిన్నకారు రైతులు లబ్దిపొందే అవకాశముందని చెబుతున్నారు.