ఇప్పటికీ పరిహారం అందలే

– మణిపూర్‌లో ఎదురు కాల్పుల్లో మరణించిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌
– సాయం కోసం ఆయన భార్య ఎదురు చూపులు
– పూట గడవటం కోసం అప్పులు
– స్పందించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
న్యూఢిల్లీ: దేశంలో భద్రతా దళాలపై అమితమైన ప్రేమను కనబరుస్తున్నామని చెప్పే బీజేపీ దానిని చేతల్లో మాత్రం చూపెట్టటం లేదు. ఇందుకు మణిపూర్‌లోని ఒక ఘటనే నిదర్శనంగా నిలుస్తున్నది. జాతి హింసలో భాగంగా ఎదురు కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మరణించగా.. ఆయన భార్యకు ఇప్పటికీ పరిహారం అందలేదు. దీంతో సదరు జవాన్‌ కుటుంబం సాయం కోసం దీనంగా ఎదరు చూస్తున్నది. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందనా రాకపోవటం గమనార్హం.
మూడు నెలల నుంచి ఎదరు చూపులు
మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ రంజిత్‌ యాదవ్‌ మూడు నెలల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి రంజిత్‌ యాదవ్‌ కుటుంబం ఒంటరైంది. ఆర్థిక సాయం లేకపోవటంతో ఆయన భార్య కౌసల్య యాదవ్‌ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏదైనా పరిహారం కోసం ఎదురుచూస్తున్నది. పరిహారం కోసం కౌసల్య మణిపూర్‌ ప్రభుత్వాన్ని రెండుసార్లు సంప్రదించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ తనకు ఎలాంటి డబ్బులు అందలేదని ఆమె అంటున్నారు. మే 3 నుంచి మణిపూర్‌లో హింస చెలరే గడంతో విధుల్లో భాగంగా రంజిత్‌ యాదవ్‌ మణిపూర్‌కు వెళ్లాడు. చివరగా జూన్‌ 5వ తేదీ రాత్రి కౌసల్యతో రంజిత్‌ ఫోన్‌లో మాట్లాడాడు. జూన్‌ 6న రంజిత్‌ ఛాతీ దగ్గర బుల్లెట్‌ తగలటంతో గాయమైంది. కక్చింగ్‌లోని జితన్‌ ఆస్పత్రికి తరలించగా.. ఆయన అక్కడ చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. అదే రోజు అంటే జూన్‌ 6న రంజిత్‌ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు తీసుకొచ్చారు.
నాన్న వస్తాడని కుమారుడి ఎదురు చూపులు
రంజిత్‌, కౌసల్యల కుమారుడు ఆయుష్‌(10).. తన తండ్రి ఏ క్షణంలోనైనా తిరిగి వస్తాడనే నమ్మకంతో పాఠశాలకు వెళ్లకుండా ఎదురుచూస్తున్నాడు అని కౌసల్య తెలిపింది. రంజిత్‌ యాదవ్‌కు భార్య, కుమారుడితో ఆయనపై ఆధారపడిన వృద్ధ తల్లిదండ్రులు, ఇద్దరు సోదరీమణులు, సోదరుడు సంజీత్‌(26)లు ఉన్నారు. పదోతరగతి వరకు చదివిన కౌసల్య ఉద్యోగం కోసం కష్టాపడాల్సి వస్తున్నదని చెప్పింది. పూట గడవటం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పింది.
జాబితాలో లేని రంజిత్‌ యాదవ్‌ పేరు
కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా జూన్‌ 1న తన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హింసలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం కక్చింగ్‌ నుంచి అందిన సమాచారం ప్రకారం ఆరుగురికి రూ. 5 లక్షల పరిహారం (కేంద్ర ప్రభుత్వ వాటా) లభించింది. అయితే, అందులో రంజిత్‌ యాదవ్‌ పేరు లేకపోవటం గమనార్హం.
‘ప్రభుత్వాలు మాట నిలబెట్టుకోవాలి’
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంజిత్‌ యాదవ్‌ కుటుంబాన్ని ఆదుకోవాలనీ, వారికి ఆర్థికంగా చేయూతనివ్వటంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాలని మాజీ సైనికులు కోరారు. ప్రభుత్వాలు తమ హామీని నిలబెట్టు కోవాలని సూచించారు. లేకపోతే దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడి మరణాన్ని పరిహసించినట్టవుతుందని వారు తెలిపారు.