మణిపూర్‌ హింసపై మౌనాసనం ఉందా !

న్యూఢిల్లీ : మణిపూర్‌లో హింసాకాండ ప్రారంభమై 50 రోజులైనప్పటికీ.. ప్రధాని మోడీ మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మణిపూర్‌లో నెలకొన్న హింసాకాండకు బాధ్యత వహించకుండా ప్రధాని కళ్లు, చెవులు మూసుకునే ఆసనం యోగాలో లేదని ఆర్మీ మాజీ అధికారి ఎద్దేవా చేశారు. ఒక ప్రయోగాత్మక ఆలోచన ఏంటంటే.. మోడీకి బదులుగా మరో వ్యక్తిని ప్రధానిగా పరిగణిద్దాం.. 50 రోజులుగా హింసాకాండతో అట్టుడుకుతున్న ఆ రాష్ట్రం పట్ల ప్రధాని ఉదాసీనంగా వ్యవహరిస్తే.. వార్తాపత్రికలు గుడ్డిగా వార్తలు ప్రచురించకుండా ఉంటాయా? అని ఆర్మీ మాజీ అధికారి సుశాంత్‌ సింగ్‌ ప్రశ్నించారు. కానీ ప్రపంచ యోగా దినోత్సవం పేరుతో మోడీ అమెరికాలో యోగా విన్యాసాలు చేసేందుకు వెళుతున్నారని ఎద్దేవా చేశారు.
వంద మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కానీ మణిపూర్‌ పరిస్థితులపై ఇప్పటికీ మోడీ మౌనంగానే వున్నారని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ జీవితాలను కాపాడాలని మణిపూర్‌ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడి ప్రజలను బలవంతంగా నివాసాల నుంచి వెళ్లగొట్టి, వలసదారులుగా మారుస్తున్నా.. మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది.
గత 50 రోజుల నుంచి మణిపూర్‌ అల్లర్లతో అట్టుడుకుతోందని, 150 మంది మరణించగా, 50,000 కంటే ఎక్కువ మంది నిరాశ్రయులయ్యారు. ఓ వైపు మణిపూర్‌ అల్లర్లు, హింసాత్మక ఘటనలో మండిపోతుంటే.. మరోవైపు ప్రధాని అమెరికా వైట్‌ హౌస్‌లో విందులు, యోగా వేడుకలు జరుపుకోవడం నమ్మశక్యం కాకుండా ఉందని ఓ యూజర్‌ ట్వీట్‌ చేశారు. అల్లరిమూకలు మణిపూర్‌లోని కేంద్ర మంత్రి నివాసాన్ని ధ్వంసం చేశారు. కానీ విశ్వగురు (ప్రధాని మోడీ) యోగా వేడుకల కోసం అమెరికా వెళ్లారని మరో యూజర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు అంతర్జాతీయ యోగా డే పేరుతో ప్రజాధనాన్ని ప్రచారం కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా, వెలుపల యోగా వేడుకల కోసం రూ. 300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు ఓ అంచనా. 2014లో బీజేపీ నేతృత్వంలో మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి యోగాడే పేరుతో భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకు యోగా వేడుకల కోసం ప్రతి ఏడాది రూ. 30 కోట్లు ఖర్చుచేసినట్టు ఆర్టీఐ చట్టం కింద ఆయూష్‌ శాఖ 2017లో సమాధానమిచ్చింది. ఐదేండ్లకు గాను ఈ వేడుకల కోసం రూ.140 కోట్లు ఖర్చు చేసినట్లు అనంతరం 2019లో ప్రభుత్వం పేర్కొంది. ఆ ఏడాది రూ. 40 కోట్లను యోగా వేడుకల కోసం ఖర్చు చేస్తున్నట్టు జాతీయ మీడియాకు ప్రభుత్వం వెల్లడించింది.

Spread the love