– ఈజిప్ట్ పర్యటనకు కైరో చేరుకున్న మోడీ
కైరో : అమెరికాలో నాలుగు రోజులు పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈజిప్ట్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం కైరో చేరుకున్నారు. ఈజిప్ట్ ప్రధాని ముస్తఫా మద్బలీ విమానాశ్రయంలో మోడీకి స్వాగతం పలికారు. అనంతరం సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆదివారం ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసితో మోడీ భేటీ అవుతారు. ఇతర నేతలు, ప్రముఖులతో కూడా మోడీ చర్చలు జరుపుతారు.
అలాగే ఈజిప్ట్‌లోని భారతీయులను కూడా కలుసుకుంటారని విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాచీన వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ప్రాతిపదికన ఇరుదేశాల సంబంధాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని భావిస్తున్నారు. ఈజిప్ట్‌తో భారత్‌కు గల బహుముఖ సంబంధాలు ఈ ఏడాది వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరాయని ఈజిప్ట్‌లో భారత రాయబారి వ్యాఖ్యానించారు. తాజాగా మోడీ జరుపుతున్న పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ప్రేరణ కలుగుతుందని అన్నారు. ఈజిప్ట్‌లో మోడీ మొదటి అధికారి పర్యటన ఇది. 26ఏళ్ళ తర్వాత భారత ప్రధాని ఈజిప్ట్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.
ఆఫ్రికా ఖండంలో భారత్‌కు గల కీలకమైన వాణిజ్య భాగస్వాముల్లో ఒకటైన ఈజిప్ట్‌లో తాజాగా మోడీ జరిపే పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది భారత రిపబ్లిక్ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా ఎల్ సిసి ఆహ్వానం మేరకు మోడీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనా సమయంలో మోడీ హెలిపోలిస్ వార్ గ్రేవ్ సిమెట్రీని సందర్శిస్తారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్ కోసం పోరాడి అశువులు బాసిన భారత సైనికులకు నివాళులు అర్పిస్తారు. దావూదీ బోరా కమ్యూనిటీ సాయంతో పునరుద్ధరణ పనులు చేపట్టిన 11వ శతాబ్దం నాటి అల్‌హకీమ్ మసీదును ఆదివారం మోడీ సందర్శిస్తారు.