‘రెరా’ అమలు పటిష్టం చేయండి

– చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ చట్టం (రెరా) అమలును పటిష్టం చేయాలని ఆ సంస్థ చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ చెప్పారు. శుక్రవారంనాడిక్కడి ప్రజా ఆరోగ్యశాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సిబ్బందికి జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘రెరా’ చట్టంలోని నిబంధనల మేరకు బిల్డర్లు, ప్రమోటర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ పొంది నిర్మాణ పనులు చేపట్టాలనీ, ప్రతి మూడునెలలకూ పనుల పురోగతి నివేదికలు, వార్షిక అకౌంట్స్‌ ఆడిట్‌ నివేదికలు సమర్పించాలని చెప్పారు. దీనిపై బిల్డర్లతో పాటు ప్రజలకు కూడా ఇంకా పూర్తిస్థాయి అవగాహన రావాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా బెంగలూరు అడ్వకేట్‌, ట్రయల్‌ బేస్‌ అడ్వకేట్‌ పార్టనర్‌ సోహెల్‌ అహ్మద్‌, చార్టెడ్‌ అకౌంటెంట్‌ టీ వినరు ‘రెరా’ చట్టంపై అవగాహన కల్పిస్తూ, పలు సెక్షన్లు, నిబంధనలను వివరించారు. ప్రాజెక్టుల్లో ఎలాంటి మార్పు చేర్పులు చేయాలన్నా, మూడింట రెండు వంతుల మంది ఆమోదం తప్పనిసరి అని తెలిపారు. ‘రెరా’ నిబంధనలు ఉల్లంఘించిన ప్రాజెక్టులు ఉత్తరప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నాయనీ, వాటిని బ్లాక్‌ లిస్టులో పెట్టడం ‘రెరా’ అథారిటీకి కీలక ఆయుధమని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్‌ రెరా సభ్యులు కే శ్రీనివాసరావు, జే లక్ష్మీనారాయణ, సలహాదారు సయ్యద్‌ లతీఫ్‌ రహమాన్‌, లీగల్‌ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సత్తయ్య, రెరా పరిపాలన అధికారి గంగాధర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ అశ్విని, రవీందర్‌, శ్రీనివాస్‌, గోపాల్‌, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.