ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతం

నేడు రవీంద్రభారతిలో తెలంగాణ విద్యాదినోత్సవం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. రాష్ట్రస్థాయి కార్యక్రమం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి లో జరగనుంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ‘మనఊరు- మనబడి’ కింద పనులు పూర్తయిన వెయ్యి పాఠశా లల ప్రారంభోత్సవం చేపడ తారు. పది వేల గ్రంథాలయాలు, 1,600 డిజిటల్‌ తరగతి గదుల ను ప్రారంభిస్తారు. ఈ సందర్భÛంగా అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేసి, తొమ్మిదేండ్ల విద్యారంగంలో పాఠశాలల ప్రగతి, విద్యారంగంలో సా ధించిన విజయాలు వివరిస్తారు. పాఠ్య, నోట్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపడతారు.
– విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఇస్తున్న ప్రభుత్వం
 సర్కారు సంస్కరణలతో సత్ఫలితాలు
 ‘మన ఊరు-మనబడి’తో మారనున్న బడుల రూపురేఖలు
 నేడు తెలంగాణ విద్యాదినోత్సవం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సర్కారు చర్యలు తీసు కుంటున్నది. విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఇస్తున్నది. విద్యార్థులకు మంచి విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం పెట్టాలని, భావితరాలు ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలన్న ఆశయం… ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. విద్యార్థులపై పెట్టే ఖర్చును భావితరం బాగుకోసం పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నది. అందుకే విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు కూడా సత్ఫలి తాలనిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన బడులకు ప్రయివేటు విద్యాసంస్థల నుంచి విద్యా ర్థుల వలసలు పెరుగుతున్నాయి. 2022-23 విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. లక్షకు పైచిలుకు విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లీష్‌ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో విద్యార్థుల నమోదు పెరిగింది.’అని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తెలంగాణ విద్యా దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నది.
విద్యారంగంలో వినూత్న వికాసం
దేశంలోనే అత్యధిక గురుకుల విద్యా లయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రవ్యాప్తంగా 1,002 గురుకుల పాఠశాల లలో5,99,537 మంది విద్యార్థులకు అంత ర్జాతీయ ప్రమా ణాలతో విద్యా బోధన జరుగు తున్నది. అక్కడ చదివే ప్రతి విద్యార్థిపై ఏడాదికి రూ.1.25 లక్షలు ప్రభుత్వం వెచ్చిస్తున్నది. అన్నిరకాల విద్యాలయాల్లో, హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం పెడుతూ, ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం అందజేస్తున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో బోధనను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని 26,815 ప్రభుత్వ పాఠశాలల్లో 23,35,952 మంది పిల్లలు చదువుకుంటున్నారు. సర్వశిక్షా అభియాన్‌ కింద 44,588 పనులను చేపట్టి 38,182 పనులను పూర్తిచేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ తగ్గుతూ, రిటెన్షన్‌ (విద్యా సంవత్సరం చివరి వరకు కొనసాగడం) పెరుగుతున్నదంటూ సర్వశిక్షా అభియాన్‌ నివేదికలో తెలిపింది.
మూడు దశల్లో మన ఊరు-మనబడి కార్యక్రమం
మూడేండ్లలో, మూడు దశలుగా 26,065 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడులను బలోపేతం చేయడం కోసం రూ.7,289 కోట్లతో మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. 12 అంశాలుగా విభజించి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నది. మొదటి దశలో 2021-22 సంవత్సరానికి 9,123 (35 శాతం) పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, బలోపేతం కోసం రూ.3,497.62 కోట్ల అంచనా బడ్జెట్‌తో పనులు చేపట్టింది.
ఇంటర్‌ విద్యలో ప్రగతి
ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ప్రగతికి సంబంధించి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఏటా 10 శాతం విద్యార్థుల సామర్థ్యం పెరుగు తున్నది. 2015-16 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల విద్యార్థుల నుంచి ఎలాంటి ట్యూషన్‌ ఫీజును వసూలు చేయకుండా ప్రభుత్వం పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. విద్యార్థులు, కళాశాల సిబ్బంది హాజరును పర్యవేక్షించేందుకు సీసీ కెమరాలు, బయో మెట్రిక్‌ మెషీన్‌లను ప్రభుత్వం అమర్చింది. పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్య లకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి జూనియర్‌ కాలేజీలో స్టూడెంట్‌ కౌన్సిలర్లను నియమించి విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తున్నది. మౌలిక సదుపా యాల కల్పనలో భాగంగా 48 కొత్త భవనాలు, 186 అదనపు తరగతి గదులు, 267 ప్రహారీ గోడలు, 350 ఆర్వో ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా 18 కొత్త భవనాలు, 14 అదనపు తరగతులు, నాలుగు ప్రహారీ గోడలను చేపట్టింది.
ఉన్నత విద్యాశాఖ అభివృద్ధి
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల నమోదుకు సంబంధించి తెలంగాణ స్థూల నమోదు నిష్పత్తి 36.2. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణా లు ఆశించిన స్థాయిలో పెరిగాయి. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉండేలా ఉన్నత విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 34 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు కొత్త భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించింది. పారద ర్శకంగా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లను చేపట్టేందుకు 2016-17 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యాశాఖ డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ ఆఫ్‌ తెలంగాణ (దోస్త్‌) విధానాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థులకు సబ్జెక్ట్‌ల ఎంపికలో విస్తృత పరిధిని కల్పించేందుకు ”ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌), బకెట్‌ పద్ధతిని ప్రవేశపెట్టింది. కోర్సుల రీడిజైన్‌తో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు 68 శాతం పెరిగాయి. విద్యారంగంలో వెనుకబడిన జిల్లాల్లో ఏడు మోడల్‌ డిగ్రీ కాలేజీలను స్థాపించింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 450 ఉన్న అధ్యాపకుల సంఖ్య ఈ ఏడాది మార్చి 31 నాటికి 1,940కి పెరిగింది. 2019-20 విద్యాసంవత్సరంలో 96 కాలేజీలకు ఐఎస్‌వో సర్టిఫికెట్‌ లభించింది.
సాంకేతిక విద్యలో ప్రగతి
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాంకేతిక విద్యాశాఖ అవసరాల కోసం రూ.127.33 కోట్ల ఖర్చుతో 17 కొత్త భవనాలను ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 12 కొత్త ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలను స్థాపించింది. ప్రభుత్వ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య 10,760 నుంచి 12,300కు పెరిగింది. 390 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, 129 మంది కాంట్రాక్టు వర్కషాప్‌ అటెండెంట్లను రెగ్యులరైజ్‌ చేసింది. ఎమర్జింగ్‌ టెక్నాలజీలుగా ఆదరణ పొందుతున్న ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎంఎల్‌ (మెషిన్‌ లెర్నింగ్‌), సైబర్‌ సెక్యూరిటీ, డేటాసైన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఎల్‌ఓటి, సీఎస్‌ఐటి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, నెట్‌వర్క్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ కోర్సులను రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశపెట్టింది. సిరిసిల్లా, వనపర్తిలో జేఎన్టీయూ కాలేజీలను స్థాపించింది. 2021-22 విద్యాసంవత్సరంలో సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో జేఎన్టీయూహెచ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ని ఏర్పాటు చేసింది.