జనరిక్‌ మందులు రాయకుంటే వైద్యులపై కఠిన చర్యలు

If generic drugs are not prescribed Strict action against doctors– ఎన్‌ఎంసీఆర్‌ఎంపీ కొత్త నిబంధనలు జారీ
న్యూఢిల్లీ : వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు చౌకగా లభించే జనరిక్‌ ఔషధాలను రాయాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టిషనర్స్‌ (ఎన్‌ఎంసీఆర్‌ఎంపీ) ఆదేశాలు జారీ చేసింది. లేదంటే వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సివుంటుందని, అవసరమైతే లైసెన్సు కూడా సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఎన్‌ఎంసిఆర్‌ఎంపి కొత్త నిబంధనావళిని జారీ చేసింది. కాగా, దేశంలోని ప్రతి వైద్యుడు జనరిక్‌ మందులనే ప్రిస్క్రైబ్‌ చేయాలని 2002లోనే భారత వైద్య మండలి (ఐఎంసీ) నిబంధనలు చేసింది. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరించే వైద్యులపై ఎలాంటి చర్యలను అందులో ప్రస్తావించలేదు. దీంతో తాజాగా ఆ నిబంధనల స్థానంలో ఎన్‌ఎంసీఆర్‌ఎంపీ నియమావళి-2023 అమల్లోకి తెచ్చినట్లు జాతీయ వైద్య కమిషన్‌ వెల్లడించింది. ఇందులో నిబంధనలను పాటించని వైద్యులపై చర్యలను కూడా పేర్కొన్నారు. నిబంధనావళిలోని కీలక అంశాలు..
ప్రతి రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టిషనర్‌ తమ వద్దకు వచ్చే రోగులకు జనరిక్‌ పేర్లతో ఔషధాలను రాయాలి.
 అనవసర మందులు, అహేతుకమైన ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ ట్యాబ్లెట్లను సూచించరాదు.
నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే.. సదరు వైద్యులను హెచ్చరిం చడంతో పాటు వర్క్‌షాపులకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేస్తారు.
ఒకవేళ పదే పదే నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే.. ఆ వైద్యుడి లైసెన్సును కొంతకాలం పాటు నిలిపివేస్తారు.
మందుల చీటీలో ఔషధాల పేర్లను క్యాపిటల్‌ అక్షరాల్లో రాయాలని జాతీయ వైద్య కమిషన్‌ ఆ నిబంధనల్లో పేర్కొంది.
బ్రాండెడ్‌ ఔషధాలతో పోలిస్తే జనరిక్‌ మందుల ధరలు 30 నుంచి 80 శాతం తక్కువగానే ఉన్నాయి. వైద్యులు జనరిక్‌ మందులనే ప్రిస్క్రైబ్‌ చేయడం వల్ల వైద్య ఖర్చులు తగ్గడంతో పాటు అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించినట్టవుతుంది.