నాలాల ఆక్రమణలపై కఠిన చర్యలు

– వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు
– హుస్సేన్‌సాగర్‌ను పరిశీలించిన మంత్రి తలసాని
– జీహెచ్‌ఎంసీ మాన్సూన్‌ ఎమర్జెన్సీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలకు అభినందన
నవతెలంగాణ-సిటీబ్యూరో
వర్షాలు తగ్గాక నాలాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామనిపశుసంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. నిండు కుండలా ఉన్న హుస్సేన్‌సాగర్‌ను శనివారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగర వాసులకు వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు 428 ఎమర్జెన్సీ బృందాలు 24 గంటలు పని చేస్తున్నాయన్నారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్‌, డీఆర్‌ఎఫ్‌ మాన్సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు సమన్వయంతో పని చేయడంతో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదన్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా తక్షణమే పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. 24 గంటలపాటు పని చేసే విధంగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, ఈవీడీఎం బుద్ధభవన్‌లో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఎప్పటికప్పుడూ సమీక్ష చేస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో నాలాపై అక్రమ నిర్మాణాలు ఉండటం మూలంగా ముంపు ఏర్పడిందని చెప్పారు. ఆ ప్రాంతంలో కూడా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఎమర్జెన్సీ బృందాలు డీఆర్‌ఎఫ్‌, పోలీస్‌ శాఖ అహర్నిశలూ కష్టపడ్డాయన్నారు. వారందరికీ అభినందనలు తెలిపారు. వర్షాలు తగ్గిన తర్వాత నాలాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రసూల్‌ పుర, మినిస్టర్‌ రోడ్‌, ముషీరాబాద్‌లో నిర్మించిన బ్రిడ్జిల వల్ల అనేక ప్రాంతాలు జలమయం కాలేదన్నారు. ఎస్‌ఎన్‌డిపి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. మరో రెండ్రోజులు వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం హుస్సేన్‌సాగర్‌ కాలువ నీటి ఉధృతిని కవాడిగూడ (భాగ్య లక్ష్మి టెంపుల్‌) వద్ద, అశోక్‌ నగర్‌ వద్ద మంత్రి పరిశీలించారు. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాష్‌ రెడ్డి, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ జియా ఉద్దీన్‌, లేక్‌ సీఈ సురేష్‌ కుమార్‌, ఎస్‌సీ ఆనంద్‌, జోనల్‌ కమిషనర్‌ రవి కిరణ్‌, డీసీ తిప్పర్తి యాదయ్యతో కలిసి హుసేన్‌సాగర్‌ ఎఫ్‌.టి.ఎల్‌ లెవెల్‌, విడుదల చేస్తున్న నీటిని హోటల్‌ మారియెట్‌ నుంచి మంత్రి తలసాని పరిశీలించారు.