బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు

జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి
కేతావత్‌ లలిత కుమారి
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
బాల వివాహాల నిర్మూళనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కేతావత్‌ లలిత కుమారి తెలిపారు. గురువారం మహిళా శిశు వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్‌ స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వికారాబాద్‌ మండలానికి చెందిన మండల, గ్రామస్థాయి అధికారులతో బాల్య వివాహాల పైన అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కేతావత్‌ లలిత కుమారి పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రామంలో మహిళా మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేజ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీలను బలోపేతం చేసి ఈ కమిటీలు ప్రతి నెల ఆ గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలనకై కృషి చేసే విధంగా సర్పంచ్‌, గ్రామపంచాయతీ కార్యదర్శి ,అంగన్వాడీ టీచర్‌, స్థానిక వార్డు మెంబర్లు , పిల్లలు మరియు ప్రజాప్రతినిధులను కలుపుకొని బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను సైతం భాగస్వాములను చేయాలని ఆమె అన్నారు. ఆడపిల్లకు 18 ఏండ్లు నిండిన తర్వాతనే పెండ్లిలు చేయాలని ఆ విధంగా కాకుండా 18 ఏండ్లలోపు పిల్లలకు బాల్య వివాహాలు చేస్తే బాల్య వివాహా నిషేధ చట్టం-2006 రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తామని ఆమె తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గత సంవత్సరము 155 బాల్య వివాహాలను నిలిపివేయడం జరిగిందని కొన్ని అనధికారికంగా జరిగిన బాల్య వివాహాల పైన ఎఫ్‌ ఆర్‌ఐ ఫైల్‌ చేశారని ఈ సంవత్సరం ఇప్పటివరకు 71 బాల్యవివాహాలను నిలిపివేసినట్టు తెలిపారు. తల్లిదండ్రుల అవగాహన రాయిత్యం వలన బాల్య వివాహాలు జరుగుతున్నాయని వాటిని కూడా అరికట్టవలసిన బాధ్యత మన అందరిపై ఉందని అయితే వికారాబాద్‌ జిల్లాను బాల్య వివాహాల లేని జిల్లాగా ప్రకటించాలంటే దానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని తెలిపారు. 18 ఏండ్లు నిండకుండా పెండ్లిలు చేస్తే ప్రభుత్వం ద్వారా అందించే కల్యాణ లక్ష్మి / షాదీముబారక్‌ పథకాలను కోల్పోతున్నారని బాల్య వివాహాలు చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పైన భారం పడుతుందని పిల్లల భవిష్యత్తు చిన్నాభిన్నమవుతుందన్నారు. మధ్యతరగతి కుటుంబాలు, ప్రేమ వివాహాలు, టెన్త్‌ ఇంటర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థుల ఆర్ధిక ఇబ్బందులతో తల్లిదండ్రులు చిన్నవయసులోనే పెండ్లిలు చేసి, బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయడం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే దృష్పరిణామాలపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తామని, అప్పటికీ మాట వినకపోతే కేసు నమోదు చేయించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాల్ని వ్యతిరేకించి , తల్లిదండ్రులతో విభేదించే బాలికలను పునరావాస కేంద్రాల్లో ఉంచి చదువు , ఉపాధి కల్పన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా పోషకాహార లోపం , రక్తహీనత , ఇతర సమస్యల వల్ల ప్రసవ సమయంలో తల్లి , బిడ్డ ఇద్దరూ మరణిస్తున్న సంఘటనలు ఇప్పటికే అనేకం చోటు చేసుకుంటున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అనంతరం ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ అధికారిణి వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తున్నట్టు ఇందులో అంగన్వాడి టీచర్ల కృషి కూడా ఉందని తెలిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడం , తల్లిదండ్రుల కష్టాలను చూసి , వారి మాట కాదనలేక చిన్నారులు పెళ్లిపీటలపై కూర్చుంటున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1098, 100కు గాని సమాచారాన్ని అందించాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ కళావతి, సూపరింటెండెంట్‌ చెన్నారెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ , పోలీస్‌ శాఖ సిబ్బంది , ఐసిపిఎస్‌ సిబ్బంది, చైల్డ్‌ లైన్‌, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.