స్త్రీకాంతి సంక్రాంతి

Strikanti Sankrantiసంక్రాంతి తెలుగింటి పెద్ద పండుగ. దీనిలో అణువణువూ స్త్రీతత్వం దాగి ఉంది. కొత్త అల్లుడు అత్తారింటికి రావాలన్నా… చీకటి వెళ్లగొట్టి కల్లాపి చల్లాలన్నా… తలంటూ స్నానాలతో ఇల్లూవాకిలి తెలవారాలన్నా…నింగిలోని చుక్కలను దించి నేలమీద పెట్టాలన్నా… ముగ్గుల్లో రంగులు అద్దాలన్నా… గడప గడపకు గొబ్బెమ్మలు ఉంచాలన్నా… గంగిరెద్దులు, హరిదాసులకు బియ్యం దానం చేయాలన్నా… కొత్త బట్టలతో ఇళ్లన్నీ కళకళలాడాలన్నా… పిల్లాపాపల సందడి ఉండాలన్నా… ధాన్యంతో ఊళ్లు నిండా లన్నా… పిండివంటలు ఘుమఘుమలాడాలన్నా… బొమ్మలు కొలువు దీరాలన్నా… ‘భోగి’ పండ్లు పోసి దీవించాలన్నా… పట్టుపరికిని కట్టి ప్రకృతినే పులకింప జేయాలన్నా అమ్మాయే కదా..! తెలుగింటి శోభ. ‘స్త్రీ’కాంతి లేని సంక్రాంతిని ఊహించగలమా…! అందుకే ఈ సంక్రాంతి పూట మహిళా ముచ్చట.
సంక్రాంతి అంటే నూతన క్రాంతి (కాంతి) అని అర్థం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించటాన్ని మకర సంక్రమణం అంటారు. ప్రతియేటా సూర్యుడు 12 రాశుల్లోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రతి రాశిలోనూ స్త్రీ విశిష్టత దాగి ఉంటుంది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి అంటే సంప్రదాయం, చక్కని పంచకట్టు, మహిళలు పట్టువస్త్రాలు ధరించి ఈ పండుగ చేసుకుంటున్నారు. అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ వచ్చాక అందరూ ఒకచోట చేరి సంక్రాంతి వేడుకలు చేసుకుంటున్నారు. దీనిలోనూ మహిళలే ప్రధాన భూమికి పోషిస్తున్నారు.
కలివిడిగా పిండివంటలు..
సంక్రాంతి శీతాకాలంలో వచ్చే అతిపెద్ద పండుగ. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ఇంటికి తెస్తారు. శీతాకాలంలో తీసుకునే ఆహారమే మనిషికి ఏడాది పాటు శక్తిని ఇస్తుంది. అందుకే కొత్తబియ్యంతో చేసిన రకరకాల పిండివంటలు ఈ పండుగలో కనిపిస్తాయి. ఈ వంటకాలన్నీ శరీరానికి శక్తినివ్వడంతో పాటు శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. వీటిలో అరిసెలు, సకినాలు, కొబ్బరి బూరెలు, నువ్వుల ఉండలు, కజ్జికాయలు, గారెలు, జంతికలు, సున్నుండలు ప్రత్యేకమైనవి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో మహిళలు ఇప్పటికీ అనేక పల్లెల్లో మూకుమ్మడి పిండివంటలు చేస్తుంటారు. ఐదారుగురు కలిసి వంటకు కావాల్సిన సామగ్రిని కొనితెచ్చుకుంటున్నారు. అందుకయ్యే ఖర్చు సమానంగా వేసుకుంటున్నారు. పిండివంటలను కూడా సరిసమానంగా పంచుకుంటున్నారు.
పొంగులేటి మాధురి పర్యవేక్షణలో
రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఉదయం, మధ్యాహ్నం వేళల్లో తన క్యాంప్‌ కార్యాలయానికి వచ్చిన వారికి టిఫిన్‌లు, భోజనాలు పెట్టడం ఆనవాయితీ. ఆయన పదవిలో ఉన్నా.. లేకున్నా ఈ సంప్రదాయాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. దీనిలో ఆయన సతీమణి మాధురి పాత్ర అత్యంత కీలకం. ఈ వంటల ఏర్పాట్లన్నీ ఆమె ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ప్రతీ పండుగకు కార్యాలయ సిబ్బందికి ఆమె తనవంతు సాయం చేస్తుంటారు. అలవెన్స్‌లు, దుస్తులు అందిస్తారు. వీటితో పాటు సంక్రాంతికి ఆమె పర్యవేక్షణలో తయారు చేసిన పిండివంటలను సిబ్బందికి పంపిణీ చేస్తారు. ఇందుకోసం ఆమె పండుగకు వారం రోజుల ముందే ఖమ్మం లేదా కల్లూరు మండలం నారాయణపురంలో ఉంటూ వంటలు తయారు చేయిస్తారు. ఈసారి సిబ్బంది కోసం అరిసెలు, బూందీ, మడత కాజాలు, లడ్డూలు ప్రత్యేకంగా తయారు చేయించారు. వీటిని ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లోని మంత్రి పేషీ, రాఘవ కన్‌స్ట్రక్షన్‌లో పనిచేసే సుమారు 250 మంది సిబ్బందికి ఇప్పటికే అందజేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతుల వియ్యంకుడు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి సైతం ఆమె తన పిండివంటలను అందించారు. కుమారుడు హర్ష, కుమార్తె సప్నీరెడ్డి, సోదరుడు ప్రసాదరెడ్డి, శ్రీలక్ష్మిల కుమారుడు లోహిత్‌రెడ్డి వివాహాల సందర్భంగానూ పొంగులేటి దంపతులు లక్షలాది మందికి భోజనాలు ఏర్పాటు చేశారు.
సంక్రాంతి ముగ్గుల పోటీలు…
సంక్రాంతి అంటే ముగ్గులు, రంగవల్లులు. నెల రోజుల ముందు నుండే ముగ్గులు లేని లోగిళ్లను చూడలేం. ముగ్గులతో మహిళలకున్న అనుబంధాన్ని విడదీయలేం. సంక్రాంతి సందర్భంగా అనేక సంస్థలు, ప్రజాప్రతినిధులు ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నారు. అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో రాష్ట్రంలో చాలా చోట్ల ఇప్పటికే ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ఈ పరంపర కొనసాగుతోంది. ఈ ఏడాది పొంగులేటి మాధురి పాలేరు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు ఆమే స్వయంగా బహుమతులు అందజేశారు. సంక్రాంతి, రథసప్తమికి ప్రత్యేక ముగ్గులు ఉంటాయి. భోగి, సంక్రాంతి రోజు వేసే ముగ్గులో పొంగలి, చెరకు గడలు ఉంటే కనుమ రోజు అందరూ తప్పనిసరిగా రథం ముగ్గు వేస్తారు. ముగ్గులు వేసిన తర్వాత నాలుగు వైపులా బార్డర్స్‌ గీయటం, పోటీలు నిర్వహించే సంస్థను దృష్టిలో పెట్టుకొని ముగ్గులు వేసి ఆకట్టుకుంటున్నారు. బహుమతులూ గెలుచుకుంటున్నారు.
బొమ్మల కొలువు…భోగి పండ్లు
సంక్రాంతి పండుగలో బొమ్మల కొలువుది కూడా ఓ ప్రత్యేకం. కాలక్రమేణా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఈ బొమ్మల కొలువు ప్రాధాన్యం కోల్పోయినా ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. కొన్ని సంస్థలు ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నాయి. ఎక్కువగా దేవుని విగ్రహాలు, హాస్య ప్రతిమలతో బొమ్మలు కొలువుతీరుతాయి. మహిళా జీవితాతు ప్రతిబింబించే బొమ్మలతో అభ్యుదయ సంస్థలు కొన్నిచోట్ల బొమ్మల ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నాయి. ఇక ఇరుగుపొరుగు మహిళలను పిలిచి భోగి రోజున పిల్లలపై భోగి పండ్లు పోయటం ఆనవాయితీ. ఇప్పటికీ చాలా చోట్ల ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇలా మొత్తంగా మహిళా బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే పండుగగా సంక్రాంతి నిలుస్తోంది. సంక్రాంతి ‘స్త్రీ’కాంతుల పండుగగా నిలవాలని.. సాధికారత దిశగా వారి పయనం సాగాలని ఆశిద్దాం.
సాధికారత దిశగా…
ఇంట్లో ఉన్న వ్యర్థాలతో పాటు మనలోని చెడునూ భోగి మంటల్లో తగులబెట్టాలి. మనుషుల మనుసులను కూడా శుద్ధి చేసుకోవాలి. నాకు పెద్దగా ముగ్గులు రానప్పటికీ తోటి మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముగ్గుల పోటీలు నిర్వహించాం. మా కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది మా సొంత మనుషులతో సమానం. అందుకే ప్రతి పండుగకు వారికి ఏదో ఒక కానుక ఇస్తాను. ఇందిరమ్మ ప్రభుత్వం మహిళా పక్షపాతి. అందుకే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు, మహిళల పేరుతో ఇందిరమ్మ ఇండ్లు, రూ.500కు గ్యాస్‌ సరఫరా చేస్తోంది. సంప్రదాయాలను పాటిస్తూనే మహిళలు సాధికారత దిశగా సాగాలనేది నా ఆకాంక్ష. – పొంగులేటి మాధురి

– కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి