– ఆందోళనకు దిగిన 1,651 ఉద్యోగులు, స్తంభించిన సేవలు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుండి పలుమార్లు పలు పంచాయతీలు ఉత్తమ పంచాయతీలుగా అవార్డులు గెలుచుకున్నాయి. ఈ అవార్డులు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన పంచాయతీరాజ్ శాఖ టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్న ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు నేడు ఉద్యోగ భద్రత కరువై, పే స్కేల్ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం నుండి సమ్మెకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా 32 మంది జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, 1,619 మంది మొత్తం 1,651 మంది ఉద్యోగులు సమ్మెకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయిలో పంచాయతీలలో సమాచారం అందించే విషయంలో అత్యంత కీలకపాత్ర పోషించిన మాకు పే స్కేల్ అమలు చేయకపోవడం ఏమిటని పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు ప్రశ్నిస్తున్నారు. గత 13 ఏండ్లుగా పనిచేస్తున్నా, మా సమస్యలను పట్టించుకోవడం లేదని, పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో సమ్మెకు దిగారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ సాంకేతిక విభాగంలో సేవలు స్తంభించాయి.
జాతీయస్థాయిలో రాష్ట్రంలోని అనేక పంచాయతీలు ఉత్తమ సేవలందించినందులకు అవార్డులు గెలుచుకున్నాయి. ఈ అవార్డులు గెలుచుకోవడంలో క్షేత్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్న ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు కీలకపాత్ర పోషించారు. జాతీయస్థాయిలో అవార్డులొచ్చాయని గొప్పగా చెప్పుకున్న సీఎం, మంత్రులు, ఆ స్థాయికి తీసుకువచ్చిన ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యలను గుర్తించి పరిష్కరించడం మాత్రం మరిచిపోయారు. అనేక మార్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు సమస్యలను పరిష్కరించాలని విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ టెక్నికల్ విభాగంలో 13 ఏండ్లుగా 32 మంది జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, 1,619 మంది ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వీరంతా ఉద్యోగ భద్రత కావాలని, పే స్కేల్ ఇచ్చి జూనియర్ అసిస్టెంట్ హోదా కల్పించాలని అనేక ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నారు.
సమ్మెకు దిగిన ఉద్యోగులు
గ్రామ పంచాయతీలలో పారదర్శకత పెంపొందించే క్రమంలో ప్రతి పంచాయతీలో ఇంటర్నెట్ వసతి కల్పించి ఈ-పంచాయతీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2014-15 ఆర్ధిక సంవత్సరంలో పంచాయతీలలో పూర్తిస్థాయిలో ఈ-పంచాయతీలుగా మార్చారు. 2012-13లో ఈ-పంచాయతీ దరఖాస్తులను పర్యవేక్షించడానికి జిల్లా ప్రాజెక్టు మేనేజర్లను నియమించారు. 2014-15లో ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. జిల్లాస్థాయిలో 32 మంది జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు పనిచేస్తున్నారు. కార్వీ సంస్థ ద్వారా 1,172 మంది ఈ-పంచాయతీ ఆపరేటర్లను నియమించి ఈ-పంచాయతీ దరఖాస్తులపై అనుభవం గడించాక ఔట్‌సోర్సింగ్ పద్దతిలో 2016 మార్చిలో మళ్లీ వీరందరిని విధుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కంప్యూటర్ ఆపరేటర్లకు 14వ ఆర్ధిక సంఘం నిధుల నుండి 10 శాతం నిధులు కేటాయించి రూ.8 వేలకు తగ్గకుండా వేతనాలు ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులను సర్కార్ ఇచ్చింది. పంచాయతీలలో అవసరాల దృష్ట్యా 2018లో 447 మంది మండల కంప్యూటర్ ఆపరేటర్లను మళ్లీ నియమించారు. వీరందరికీ ఆర్‌జిఎస్ కింద వేతనాలు ఇచ్చారు. ఏడాది తరువాత ఆర్‌జిఎస్ నిధులు లేనందునా గ్రామపంచాయతీ పరిపాలన నిధులు కింద 10 శాతం నిధుల నుండి వేతనాలు ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారులకు సర్కార్ ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల వరకు బాగానే వున్నా వీరికి ఉద్యోగ భద్రతను నేటికీ కల్పించలేదు.
సర్కార్ పనులన్నీ ..
ఒక్క ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ 8 నుండి 10 గ్రామ పంచాయతీల పనులు చేస్తున్నారు. రాష్ట్రంలోని 12 వేల 769 పంచాయతీల రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారంతోపాటు ప్రతి సమచారాన్ని క్రోడీకరించి నివేదికలను రూపొందించి పంపుతున్నారు. పల్లె ప్రగతి, హరితహారం, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, భవన నిర్మాణం, ఆస్తి మార్పిడి, వ్యాపార లైసెన్స్‌లు, నెలవారీ కార్యక్రమాలు, ఆసరా పెన్షన్ల నమోదు, ఎస్సీ, ఎస్టీ, బిసి మరియు మైనార్టీ కార్పొరేషన్లు, దళిత బంధు, బిసి బంధు, గృహలక్ష్మీ తదితర సంక్షేమ పథకాల సమచారం, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలతోపాటు పంచాయతీలు, ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల సమాచారం క్రోడీకరించడం వంటి అనేక కీలక పనుల్లో వీరంతా మమేకమై పనిచేస్తున్నా మా డిమాండ్‌లను పరిష్కరించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు చేసే పనులన్నింటినీ ప్రభుత్వ వెబ్‌సైట్లలో నమోదు చేస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తూ విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. డిమాండ్లు….
జిల్లాస్థాయిలో పనిచేస్తున్న జిల్లా ప్రాజెక్టు మేనేజర్లకు పే స్కేల్ అమలు చేసి, ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. మహిళా ఉద్యోగులందరికీ వేతనముతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని, ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని వసతులను వర్తింపచేయాలంటున్నారు.
పే స్కేల్ అమలు చేయాలి : గడ్డం శేషాద్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఈ-పంచాయతీ టెక్నికల్ వింగ్
మన పంచాయతీలు జాతీయస్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా అవార్డులు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన మాకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలి. మమ్మల్ని క్రమబద్ధీకరించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన అన్ని వసతులను మాకు వర్తింపచేయాలి.