– రిజిస్టర్‌లో సంతకం, వేతనమివ్వకుండా అధికారుల వివక్ష
– కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు
– ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనం, ఉద్యోగం కల్పించాలని నిరాహార దీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల కాలికి ముల్లు గుచ్చుకుంటే తాను పంటితో తీస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఉంటే అధికారులు మాత్రం వారి పట్ల అక్కసు వెళ్లగక్కుతూ.. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. సీమాంధ్ర ఉద్యోగి కావడం, అధికారులను ప్రశ్నించడమే దళిత కాంట్రాక్టు ఉద్యోగి పట్ల శాపంగా మారింది. ఉద్యోగం నుంచి తొమ్మిదేండ్లు పక్కన పెట్టడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. నాంపల్లిలోని ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్, హైకోర్టును ఆశ్రయించినా, రాష్ట్రంలోని ముఖ్య అధికారులు, మంత్రులకు, రాష్ట్రపతికి లేఖలు రాసినా అధికారులు మాత్రం అతన్ని ఉద్యోగంలోకి తీసుకోకుండా వివక్షకు గురిచేస్తున్నారు. ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ అప్పట్లోనే వేతనం చెల్లించాలని సూచించినా కమిషన్ సూచనలు అధికారులు పట్టించుకోలేదు. అతని తిరిగి ఉద్యోగంలో తీసుకునే ప్రసక్తే లేదనట్టుగా మల్లేపల్లి ఐటీఐ ఉన్నతాధికారుల వ్యవహార శైలి కనిపిస్తోంది.
నగరం నడిబోడ్డున ఉన్న మాసబ్ ట్యాంక్ విజయనగర కాలనీలోని ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ ఐటీఐ కాలేజీ మల్లేపల్లిలో ఆగస్టు 1, 2008లో నూకతోటి పెద కొండయ్య(దళితుడు) అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్‌గా అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగం సాధించారు. 2011లో ఆనాటి లేబర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ డాక్టర్ దాసరి శ్రీనివాసులు ఐఏఎస్ వీరిని అవుట్‌సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్స్‌గా మార్చారు. ఇలా కాంట్రాక్ట్ ద్వారా ప్రతేడాది రెన్యూవల్ చేస్తూ.. 2014 జూన్ 30 వరకు ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ కొండయ్య జీతభత్యాలు ఇచ్చారు. జూన్ 2, 2014న తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగుతున్న 320 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్స్(ఏటివో)ను జీ.ఓ.ఆర్.నెం 43, తేదీ 19 జులై 2014 ప్రకారం 01 జులై 2014 నుంచి 30 జూన్ 2015 వరకు కొనసాగిస్తామని అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ మల్లేపల్లిలో నూకతోటి పెద కొండయ్య విధులు నిర్వహించారు. తదుపరి సంవత్సరాల్లో ఏటీవోలను కొనసాగిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. ఉమ్మడి రాష్ట్రంలో డిపార్టుమెంట్ ఆఫ్ లేబర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్‌లో కొనసాగుతున్నటువంటి ఏటీవోలను కొనసాగించామని 1, జూన్ 2014న జీవో 13ను అప్పటి ప్రభుత్వ కార్యదర్శి నాగిరెడ్డి జారీ చేశారు. 2014 నుంచి 2015 వరకు 320 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్స్(ఏటివో)ను కొనసాగించామని జీవో నెం 43 జారీ చేయగా.. ఇందులో కేవలం లోకల్ కాంట్రాక్టు ఏటీవోలను అయిదుగురిని మాత్రమే గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ మల్లేపల్లి అప్పటి ప్రిన్సిపాల్, ప్రస్తుత డిప్యూటీ డైరెక్టర్ అటెండెన్సు రిజిస్టర్‌లో సంతకాలు చేసేందుకు అనుమతి ఇచ్చి.. వారికి వేతనాలు చెల్లించారు. నలుగురు నాన్ లోకల్, కాంట్రాక్ట్ ఏటీవోలకు తెలంగాణ ఉత్తర్వుల ప్రకారం మార్గదర్శకాలను పాటించకుండా అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయడానికి అనుమతి ఇవ్వలేదు. ఈ నలుగురిలో ప్రకాశం జిల్లాకు చెందిన నూకతోటి పెద కొండయ్య (వర్క్‌షాప్ క్యాల్‌క్యులేషన్ అండ్ వోకేషనల్ సైన్ ట్రేడ్) కూడా ఉన్నారు. విద్యార్హతలు లేనివారు మరో నలుగురిని పక్కకు పెట్టారు. కాగా మొత్తం 13 మంది కాంట్రాక్టు ఏటీవోలకు సంవత్సరానికి సుమారు రూ. 15 లక్షల బడ్జెట్‌లో రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపించారు. అయినప్పటికీ ఐటీఐ విద్యార్థులకు అకాడమీక్ ప్రకారం తరగతులు నిర్వహించారు. జీవో 43 ప్రకారం తరగతులు బోధించినా తమకు వేతనాలు ఇవ్వడం లేదని.. 2015లో ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించడంతో.. దాన్ని పరిశీలించిన కమిషన్ వెంటనే వేతనాలు చెల్లించాలని చెప్పినా పట్టించుకోలేదు. అదే ఏడాదిలో దీనిపై హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి వేతనాలు చెల్లించాలని ఆదేశాలిచ్చింది. సదరు ఉత్తర్వులను అమలు చేయాలని ప్రిన్సిపాల్‌ను కోరగా.. ‘నామీదనే నీవు కోర్టుకు వెళ్తావా! నీ జీవితాంతం మల్లేపల్లి ఐటీఐ నుంచి వేతనం గాని, నీ ఉద్యోగాన్ని కొనసాగించనని’ నూకతోటి పెద కొండయ్యపై కోపోద్రుక్తుడైనాడు. జడ్జీ ఆర్డర్‌ను తిరస్కరించి.. కేవలం అందులోని ముగ్గురు నాన్-లోకల్ అభ్యర్థులకు వేతనాలు చెల్లించారు. అదే సంవత్సరంలో కోర్డు ధిక్కరణ కింద అప్పటి ప్రిన్సిపాల్‌పై కేసు కూడా నమోదు చేశారు. 2015 అక్టోబర్ నుంచి విద్యార్థులకు క్లాసులు బోధించకుండా కొండయ్యను అడ్డుకున్నారు. ఇందుకు అప్పటి విద్యార్థులే సాక్షులుగా ఆయన చెబుతున్నారు. కాగా, 2014-15, 2015-16, 2016-17, 2017-18, 2018-19, 2019-20, 2020-21, 2021-22, 2022-23 అనగా 9 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఏటీవోలలో నూకతోటి పెద కొండయ్య పేరు మీద కూడా బడ్జెట్ అలాట్‌మెంట్‌తో పాటు ఆయన పోస్టును తెలంగాణ ప్రభుత్వం కొనసాగించింది. అయినప్పటికీ మల్లేపల్లి ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపాల్ తొమ్మిదేండ్లుగా అతనికి వేతనాలు చెల్లించడం లేదు. ఇప్పటికైనా అతనికి వేతనం ఇప్పించి, జీవనోపాధి కల్పించి, ఆదుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నారు. నూకతోటి పెద కొండయ్య ఏపీకి చెందిన వాడనే కారణంగా కనీస మానవత్వం చూపకుండా మానసికంగా, దుర్మార్గంగా ఒక కాంట్రాక్టు ఉద్యోగం చేసుకోనివ్వకుండా డిపార్టుమెంట్ ఆఫ్ లేబర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ ప్రస్తుత డిప్యూటీ డైరెక్టర్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు, మంత్రులు, రాష్ట్రపతికి వరకు వెళ్లి తన బాధను మొరపెట్టుకున్నా.. వాటిని అడ్డుకుంటూ తనపైనే లేనిపోని నిందలు మోపుతున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒకవైపు తల్లిదండ్రులను కోల్పోయి.. తమ్ముడిని కోల్పోయి… 49 ఏండ్ల వయసులో తొమ్మిదేండ్లుగా సుదీర్ఘమైన పోరాటం చేస్తూ.. ఒంటిరివాడి జీవనం సాగిస్తూ.. చేతిలో డబ్బులేక ఆర్థికంగా మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతున్నానని తెలిపారు. కాగా, మల్లేపల్లి ఐటీఐ కాలేజీ ఎదుట వారం రోజులుగా నిరహార దీక్ష చేస్తున్నారు. తన ప్రాణాలు పోయిన పర్వాలేదు కానీ.. న్యాయం కావాలని కోరుతున్నారు. ఈ విషయంపై వివరణ కోసం ప్రస్తుత డిప్యూటీ డైరెక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.