ఇంటి జాగా దక్కేవరకు పోరాటం…

Struggle till you get the house...– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌
– జిల్లా కేంద్రంలో గుడిసెవాసుల భారీ ర్యాలీ
– కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-ములుగు డెస్క్‌
ములుగు జిల్లా వాజేడు మండలంలో ప్రభుత్వ భూమిలో 2000 మంది నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే, వాటిని తొలగించడంతో.. 15 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారని, ఇండ్లు తొలగిస్తే ప్రతిఘటిస్తామే కాని చూస్తూ కూర్చోమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని డీఎల్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు గుడిసెవాసుఉల భారీ ర్యాలీ చేసి నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదల కుటుంబాలు ఇరుకు ఇండ్లలో జీవనం సాగిస్తున్నారన్నారు. తెలంగాణ వస్తే పేదలకు పక్కా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ విస్మరించారని తెలిపారు. గోదావరి వరదలకు ముంపునకు గురయ్యే గ్రామంలో ప్రజలకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వాలని అనేక మార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. విసిగిపోయిన ప్రజలు వాజేడు రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్‌ 11లోని 70 ఎకరాల్లో గుడిసెలు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆ గుడిసెలకు హక్కు కల్పించకుండా తొలగించాలని చూడటం సరి కాదన్నారు. జాగా వదిలిపోయేది లేదని, ఉంటే గుడిసెలో.. లేకపోతే జైల్లో తప్ప జాగా వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 2000 మంది పేదలు 15 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం స్పందించక పోవటం దుర్మార్గమన్నారు. వాజేడులో మొదలైన పోరాటం ములుగు వరకు వచ్చిందని, గుడిసెలు దక్కకపోతే హైదరాబాద్‌ వరకు కూడా పోతామని స్పష్టంచేశారు.
అనంతరం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వాజేడు మండలంలో 40 గ్రామాల నుంచి 1950 మంది పేదలు గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారని వారికీ హక్కు కల్పించకుండా వెళ్లగొట్టాలని చూస్తున్నారని తెలిపారు. 20 గ్రామాల్లో ప్రజలు ముంపునకు గురవుతున్నా వారిని పాటించుకొనే నాథుడే లేడని, వరదలు వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లి వరదలు పోయాక నడిరోడ్డు మీద వదిలి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారికి ఇండ్ల జాగాలు ఇచ్చి, ఇల్లు కట్టించి ఇవ్వాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం ఆర్డీవో సత్యపాల్‌ రెడ్డికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, జిల్లా నాయకులు బీరెడ్డి సాంబశివ, రత్నం రాజేందర్‌, ఎండీ దావుద్‌, గ్యానం వాసు, వాజేడు మండల కార్యదర్శి కొప్పుల రఘుపతిరావు, నాయకులు గుగ్గిళ్ళ దేవయ్య, బచ్చల కృష్ణబాబు, జెజ్జరీ దామోదర్‌, బచ్చల సౌమ్య, తోలేం ముత్తయ్య, కారం బులక్ష్మి, పాయం కుమారి తదితరలు పాల్గొన్నారు.