అడ్డంగా చిక్కాడు…

– సెక్స్‌ సంభాషణ చేస్తూ దొరికిపోయిన బీజేపీ నేత సోమయ్య
– మరాఠీ న్యూస్‌ ఛానల్‌లో వైరల్‌
న్యూఢిల్లీ : చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేది…గుడిసెలు అన్న చందంగా ఉంది బీజేపీ నేతల తీరు. నైతికత, భారతీయత, సంస్కృతీ సంప్రదాయాల గురించి నిత్యం సుద్దులు చెప్పే ఆ పార్టీ నాయకులు ఆచరణలో మాత్రం ‘ఎదుటి మనిషికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి’ అంటున్నారు. ‘కుమార్తెలను రక్షించండి…కుమార్తెలను విద్యావంతులను చేయండి’ అంటూ నినాదాలు చేసే ఆ పార్టీ నేతలు మహిళలను కించపరిచేలా ప్రవర్తిస్తూ తమ నిజస్వరూపాన్ని చాటుకుంటున్నారు.
తాజాగా బీజేపీ సీనియర్‌ నేత కిరిత్‌ సోమయ్య ఓ మహిళతో అసభ్యకరంగా సంభాషిస్తూ మరాఠీ న్యూస్‌ ఛానల్‌ ‘లోక్‌షాహీ’కి చిక్కారు. తనకు, ఆ మహిళకు మధ్య లైంగిక సంబంధం ఉన్నదని అర్థమొచ్చేలా సోమయ్య ఆ వీడియోలో సంభాషించారు. అయితే ఈ వీడియో కల్పితమని సోమయ్య చెప్పారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తాను ఎన్నడూ మహిళలను అవమానించలేదని అన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు.
సోమయ్య అసభ్య ప్రవర్తనకు సంబంధించి సోమవారం సాయంత్రం వెలుగులోకి వచ్చిన వీడియో దృశ్యాలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. పైగా తన వద్ద ఇలాంటి వీడియో క్లిప్పింగులు అనేకం ఉన్నాయని ఆ ఛానల్‌ బాంబు పేల్చింది. సోమయ్య అనేక మంది మహిళలను లైంగికంగా వేధించారని, దీనికి సంబంధించి తమకు పలు ఫిర్యాదులు అందాయని కూడా ఆ ఛానల్‌ తెలిపింది. ఒకసారి ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన సోమయ్య ప్రస్తుతం బీజేపీ మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
చర్యకు ప్రతిపక్షాల డిమాండ్‌
సోమయ్య ఉదంతంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతున్న సోమయ్య ఇతరులపై బురద చల్లే నైతిక హక్కును కోల్పోయారని ఎన్సీపీ (శరద్‌ పవార్‌) నేత విద్యా చవాన్‌ విమర్శించారు. ‘కిరిత్‌ సోమయ్య దుందుడుకు స్వభావం అందరికీ తెలిసిందే. దూకుడుగా వ్యవహరించే ఆయన నైజం ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. ఎక్కడ అవినీతి జరిగినా దానిని ఆయన ఎండగడుతుంటారు. అలాంటి ప్రముఖ వ్యక్తి ఇలాంటి దుష్ప్రవర్తనకు పాల్పడిన మాట నిజమే అయితే ఆయనపై సరైన చర్య తీసుకోవాల్సిందే’ అని ఆయన అన్నారు. ఇలాంటి వీడియో బయటపడడం చాలా తీవ్రమైన విషయమని, విచారకరమని ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) నేత రూపాలీ థోమ్రే పాటిల్‌ చెప్పారు. ఛానల్‌లో ప్రసారమైన వీడియో నిజమైతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాగా నైతికత గురించి ఉపన్యాసాలు దంచే బీజేపీ నేతలకు కిరిత్‌ సోమయ్యను బాధ్యుడిని చేసి, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే ధైర్యం ఉన్నదా అని కాంగ్రెస్‌ నేత యశోమతి ఠాకూర్‌ ప్రశ్నించారు. మోసపూరిత ప్రజా జీవితం గడుపుతున్న సోమయ్య ఇప్పుడు ఈ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని నిలదీశారు. కాగా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) డిమాండ్‌ చేసింది. అయితే ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ ఈ ఉదంతంపై స్పందించలేదు.