బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థిని ఆత్మహత్య

నవతెలంగాణ – బాసర
నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దీపిక.. బాత్‌రూమ్‌లో చున్సీతో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, యూనివర్సిటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా వడ్లపల్లి మండలం గొర్రెకల్‌ గ్రామానికి చెందిన వడ్ల దీపిక.. యూనివర్సిటీలో జరుగుతున్న వార్షిక పరీక్షల్లో భాగంగా మంగళవారం ఫిజిక్స్‌ పరీక్ష రాసిన అనంతరం తోటి విద్యార్థులతో మానసికంగా బాలేదని చెప్పి బాత్‌రూమ్‌కు వెళుతున్నట్టు చెప్పి వెళ్లింది. బాత్‌రూమ్‌కు వెళ్లి ఎంతసేపైనా తిరిగి రాకపోయేసరికి అనుమానంతో భద్రతా సిబ్బంది బాత్‌రూమ్‌ డోర్లను పగలగొట్టి చూడగా.. బాత్‌రూమ్‌ ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. దాంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థిని అప్పటికే మృతి చెందిందని ధృవీకరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్టు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు. కాగా, వార్షిక పరీక్షలు రాసే సందర్భంగా విద్యార్థిని కాపీయింగ్‌కు పాల్పడుతూ యూనివర్సిటీ అధ్యాపకులకు పట్టుబడినట్టు సమాచారం. దీంతో అధ్యాపకులు ఆమెపై ఇతర విద్యార్థినుల ముందు ఆగ్రహం వ్యక్తం చేయడంతో విద్యార్థిని అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే విద్యార్థిని ఆత్మహత్యపై వైస్‌ ఛాన్స్‌లర్‌ వెంకటరమణ విచారణకు ఆదేశిస్తూ నలుగురు సభ్యులతో కమిటీని నియమించారు. కమిటీలో కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌, అసోసియేట్‌ డీన్‌, సైన్సెస్‌, చీఫ్‌ వార్డెన్‌, అసోసియేట్‌ డీన్‌, స్టూడెంట్‌ వెల్ఫేర్‌ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ త్వరితగతిన విచారణ జరిపి నివేదికను అందజేయాలని ఆదేశించారు.