యూనివర్సిటీ పాలక మండలి పై విద్యార్థి సంఘాల ఆగ్రహం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలకు అన్యాయాలకు పరిష్కారం దొరికిందని అనుకుంటున్నా వేళ పాలక మండలి రద్దు అనే విషయం ఎన్నో అనుమానాలకు దారితీస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు అవేదన వ్యక్తం చేశారు. గురువారం యూనివర్సిటీ లో కోద్దిసేపు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 27 న రద్దయిన పాలకమండలీని 7 సార్లు ఏ విధంగా సమావేశం ఏర్పాటు చేశారని,7 సార్లు సమావేశమైన పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు నమ్మొచ్చని వివరించారు. పాలకమండలి రద్దయితే దానిలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి 16 వేల రూపాయల చొప్పున అప్పజెప్పి సుమారు 10 లక్షలకు పైగా యూనివర్సిటీ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వీటిని వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.పాలకమండలి రద్దయిన విషయం ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ కి తెలియదా అని? తెలిస్తే ఆయనే ఎందుకు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని యూనివర్సిటీ అభివృద్ధి, విద్యార్థుల అభివృద్ధి కోసం మంచి నిర్ణయాలు తీసుకొని విద్యార్థులకు అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఒకవేళ ఈ వారం రోజుల్లో గా దీనిపైన విచారణ జరిపి క్లారిటీ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్ఎ అధ్యక్షులు నిఖిల్, ఎంఎస్ఎఫ్ అధ్యక్షులు దినేష్, భీమ్ ఆర్మీ ఇంచార్జీ సురేష్, ఎస్ఎఫ్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.