సుభాష్‌ ముండా హత్య అత్యంత దారుణం

– దుండగులను కఠినంగా శిక్షించాలి
– తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌(ఏఎఆర్‌ఎం) జాతీయ నాయకులు సుభాష్‌ ముండా హత్య అత్యంత దారుణమనీ, దీనికి కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఎజీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిడియం బాబూరావు, పూసం సచిన్‌ శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జార్ఖండ్‌లోని ఆదివాసీల హక్కులకోసం సుభాష్‌ముండా నిరంతరం పోరాడారని గుర్తుచేశారు. ఆదివాసీల జీవనోపాధికోసం పేదరిక నిర్మూలన, అన్యాయాలకు వ్యతిరేకంగా వారిని సంఘటితం చేయటానికి అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపారు. భూ నిర్వాసితులకు, జమీందారీ అణచివేతకు వ్యతిరేకంగా ఆదివాసీలను సంఘటితం చేశారని పేర్కొన్నారు. 1960వ దశకంలోనే ఆయన తాత సుక్ర ముండా భూస్వాములకు వ్యతిరేకంగా దళదాలీలో అనేక భూ పోరాటాలకు ఆదివాసీలకు నాయకత్వం వహించారని తెలిపారు. సుభాష్‌ముండా2010 నుంచి జార్ఖండ్‌లోని ఛోటానాగ్‌పూర్‌ ప్రాంతంలో ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ ప్రాంతీయ కన్వీనర్‌గా పనిచేస్తున్నారని తెలిపారు.