రెండు నెలల్లో పురోగతి నివేదికను సమర్పించండి

– మణిపూర్‌ దర్యాప్తు పర్యవేక్షకులు, మాజీ హైకోర్టు న్యాయమూర్తుల ప్యానెల్‌కు
– సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : మణిపూర్‌లో పరిస్థితులపై రెండు నెలల్లో పురోగతి నివేదికను సమర్పించాలని దర్యాప్తు పర్యవేక్షక అధికారి, మాజీ హైకోర్టు న్యాయమూర్తుల ప్యానెల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మణిపూర్‌లో హింస ఆగిపోయేలా చూడాల్సిన అవసరం ఉన్నదని కోర్టు స్పష్టం చేసింది. చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం ప్రకారం హింసకు పాల్పడినవారు శిక్షించబడతారనీ, తత్ఫలితంగా, న్యాయ వ్యవస్థపై సమాజం విశ్వాసం పునరుద్ధరించబడుతుందని వెల్లడించింది. ఈ మేరకు మణిపూర్‌ రాష్ట్రంలో జాతి ఘర్షణల కారణంగా తలెత్తే కేసుల దర్యాప్తును పర్యవేక్షిస్తున్న మహారాష్ట్ర మాజీ డీజీపీ దత్తాత్రరు పద్సాల్గికర్‌తో పాటు మానవతా దక్పథాలను పరిశీలిస్తున్న ముగ్గురు మాజీ హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ పురోగతిని సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు న్యాయస్థానం వారికి రెండు నెలల సమయాన్ని కేటాయించింది.