నివారణ చర్యలు సూచించండి

– కోటా విద్యార్థుల ఆత్మహత్యలపై
– కమిటీకి రాజస్థాన్‌ సీఎం ఆదేశం
జైపూర్‌ : రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. పిల్లల భవిష్యత్తుపై కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు బలవన్మరణాలు తీవ్ర శోకాన్ని మిగిలుస్తున్నాయి. ఈ తరుణంలో రాజస్థాన్‌ ప్రభుత్వం స్పందించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలను సూచించే కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు, కోచింగ్‌ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో గెహ్లాట్‌ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇంజినీరింగ్‌, మెడికల్‌ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న వారితోపాటు సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి కోసం కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌ల కేంద్రంగా ఉన్న కోటాలో ఈ ఏడాది వరుస ఆత్మహత్యలు సంచలనం రేపాయి.
కాగా, ఈ కమిటీలో కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల ప్రతినిధులు, తల్లిదండ్రులు, వైద్యులు కూడా ఉండాలని గెహ్లాట్‌ ఆదేశించారు. కమిటీ 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 9, 10వ తరగతి విద్యార్థులు కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో చేరడం వల్ల అదనపు భారం పడుతుందని గెహ్లాట్‌ చెప్పారు. దీంతో కమిటీ తన నివేదికలో ఏ సలహాలు, సూచనలు చేస్తుందోనన్న విషయంపై ఆసక్తి నెలకొన్నది.