– జట్టు సమావేశం, డెక్సా స్కాన్‌కు పరిమితం
– భారత జట్టు ఆసియా కప్ క్యాంప్
నవతెలంగాణ-బెంగళూర్
వరుసగా రెండు మెగా ఈవెంట్లకు సన్నద్ధమవుతున్న టీమ్ ఇండియా.. ఆగస్టు 30 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్ ముంగిట బెంగళూర్‌లో శిక్షణ శిబిరంలో పాల్గొంటుంది. రెండు రోజుల పాటు మైదానంలో క్రికెటింగ్ డ్రిల్స్‌తో చెమటోడ్చిన రోహిత్‌సేన.. ఆదివారం మైదానం నుంచి కాస్త విరామం తీసుకుంది!. గ్రౌండ్‌కు వెళ్లకపోయినా.. క్రికెటర్లకు ఆశించిన విశ్రాంతి లభించలేదు. జాతీయ క్రికెట్ అకాడమీలో జట్టు సమావేశంలో పాల్గొన్న క్రికెటర్లు.. కీలక డెక్సా స్కాన్‌కు వెళ్లారు. బెంగళూర్ శివారులోని ఆలూర్ గ్రౌండ్స్‌లో భారత జట్టు సాధన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 29తో శిక్షణ శిబిరం ముగియనుండగా.. మరుసటి రోజు బెంగళూర్ నుంచి కొలంబోకు భారత జట్టు బయల్దేరనుంది.
ప్రాక్టీస్ ప్రాక్టీస్
ఆసియా కప్ క్యాంప్‌లో భాగంగా తొలి రోజు క్రికెటర్లు అందరూ యోయో ఫిట్‌నెస్ టెస్టుకు హాజరయ్యారు. ఐర్లాండ్ పర్యటన నుంచి వచ్చిన క్రికెటర్లు ఆ తర్వాత ఈ టెస్టు పూర్తి చేశారు. రెండో రోజు ఆలూర్ గ్రౌండ్స్‌లో బ్యాటింగ్ సాధన చేవారు. మూడో రోజు ప్రధానంగా మ్యాచ్ సిములేషన్స్ (అనుకరణలు)పై దృష్టి నిలిపారు. పేసర్లు యశ్ దయాల్, ఉమ్రాన్ మాలిక్ సహా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో బ్యాటింగ్ జోడీలకు బౌలింగ్ చేశారు. నాల్గో రోజు గ్రౌండ్ వర్క్‌కు విరామం లభించగా క్రికెటర్లు కీలక డెక్సా స్కాన్ పరీక్షకు వెళ్లారు. ఇక చివరి రెండు రోజుల శిక్షణ శిబిరంలో సైతం మ్యాచ్ సిములేషన్స్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్లను ఎదుర్కొవటంలో భారత బ్యాటర్ల బలహీనత బహిరంగమే. అందుకోసం అనికెత్ చౌదరిని పిలిపించిన ద్రవిడ్.. రోహిత్ శర్మ, అండ్ మెన్‌ను సవాల్‌కు సిద్ధం చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు సాయి కిశోర్, కుల్దీప్ యాదవ్ సహా మరో పది మంది నెట్ బౌలర్లు విరాట్ కోహ్లి బౌలింగ్ చేశారు. ప్రాక్టీస్‌లో భాగంగా శనివారం రెండు గంటల పాటు బ్యాటింగ్ చేసిన కెఎల్ రాహుల్.. వికెట్ కీపింగ్ సమయంలో ఇబ్బంది పడినట్టు కనిపించింది.
ఏమిటీ డెక్సా స్కాన్? :
డెక్సా (డిఈఎక్స్‌ఏ) అనగా డ్యూయెల్ ఎనర్జీ ఎక్స్ రే అబ్సాప్సియోమెట్రీ. ఎముక మినరల్ డెన్సిటి, బోన్ డెన్సిటి మోతాదు శాతం తెలుసుకునేందుకు ఇదో ఓ శాస్త్రీయ పద్దతి. ఈ పరీక్షలో రెండు ఎక్స్ రే బీమ్‌లు విభిన్న ఎనర్జీ లెవల్స్‌లో ఓ వ్యక్తి ఎముకపై పడతాయి. అందుకు అనుగుణంగా ప్రస్తుత ఎముక సాంద్రత, మినరల్ కంటెంట్ ఎంత ఉన్నాయనేది తెలుస్తుంది. ఈ పరీక్షతో గాయాల బారిన పడే ప్రమాదం నుంచి తప్పించటంతో పాటు, ప్రత్యేక డైట్ పాటించేందుకు సైతం ఉపయోగిస్తారు.