ఈడీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు

Supreme Court Stumps for EDన్యూఢిల్లీ : అరెస్టులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి సుప్రీంకోర్టు బుధవారం మొట్టికాయ లేసింది. కేసుల దర్యాప్తు సమయంలో ఈడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదనీ, చట్ట ప్రకారం వ్యవహరించాలని హెచ్చరించింది. మనీలాండరింగ్‌ కేసులో గురుగ్రామ్‌ కంపెనీకి చెందిన రియల్టి గ్రూప్‌ ఎం3ఎం డైరెక్టర్లు బసంత్‌ బన్సాల్‌, పంకజ్‌ బన్సాల్‌ల అరెస్ట్‌లను మంగళవారం కొట్టివేసిన సుప్రీంకోర్టు ఈడీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ తీర్పు బుధవారం నోట్‌ చేయబడింది.
తమ అరెస్ట్‌లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను పంజాబ్‌, హర్యానా హైకోర్టు కొట్టివేయడంతో .. వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జూన్‌ 14న బన్సాల్‌ను విచారణకు రావాల్సిందిగా సమన్లు జారీ చేశారని, అదే రోజు ఈడీ నమోదు చేసిన మరో కేసులో అరెస్ట చేశారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈడీ ప్రతి చర్యా పాదర్శకంగా, ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ, ఈ కేసులో దర్యాప్తు సంస్థ తన అధికారాలను, విధులను అనుసరించడంలో విఫలమైందని వాస్తవాలు నిరూపించాయని పేర్కొంది. ఈడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదని, చట్టబద్దంగా వ్యవహరించాలని ఆదేశించింది. ప్రశ్నలకు నిందితులు సమాధానం ఇవ్వకపోవడంతో అరెస్టు చేయడం సరికాదని హెచ్చరించింది. మనీలాండ రింగ్‌ చట్టం కింద వారు నేరానికి పాల్పడ్డారని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలను సేకరించి అరెస్టు చేయాలి తప్ప సమన్లకు సరిగా స్పందించలేదని ఎవరినీ అరెస్టు చేయకూడదని పేర్కొంది. అరెస్టు సమయంలో అందుకు గల కారణాలను కూడా నిందితులకు లిఖితపూర్వకంగా అందించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈడి మాజీ ప్రత్యేక న్యాయమూర్తి సుధీర్‌ పర్మార్‌, అతని మేనల్లుడు రూప్‌ కుమార్‌ బన్సాల్‌ (రియల్టీ సంస్థలో మూడో భాగస్వామి) లంచం ఆరోపణ కేసులో బన్సాల్‌ సోదరులను ఈడి అరెస్ట్‌ చేసింది. దీంతో రూప్‌ కుమార్‌ బన్సాల్‌, బసంత్‌ బన్సాల్‌లపై సుధీర్‌ పర్మార్‌ అభిమానం చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉందని ఈడి కోర్టుకు తెలిపింది.