నీట్‌ కౌన్సెలింగ్‌ వాయిదాకు సుప్రీం నో

న్యూఢిల్లీ : నీట్‌ పరీక్ష వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న నేపథ్యంలో జులై 6 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్‌ ప్రక్రియను వాయిదా వేయడానికి సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఇదేమీ ‘తెరిచి, మూసివేసేది కాదు’ అని వ్యాఖ్యానించింది. మే 5న నిర్వహించిన నీట్‌ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతో మొత్తంగా పరీక్షను రద్దు చేయాలని కోరుతున్న పిటిషన్‌పై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ), కేంద్రానికి, ఇతరులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై పెండింగ్‌లో వున్న ఇతర పిటిషన్లతో కలిపి దీనిపై కూడా జులై 8న విచారణకు నిర్ణయించింది. 8న సుప్రీం కోర్టు ఈ పిటిషన్లన్నింటినీ విచారిస్తున్నందున, రెండు రోజుల పాటు కౌన్సెలింగ్‌కు విరామం ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. మొత్తంగా కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని మేం కోరడం లేదు. కేవలం రెండు రోజులు వాయిదా వేయాలని మాత్రమే కోరుతున్నాం. ప్రధాన అంశంపై 8న విచారణ జరుగుతున్నందునే ఈ అభ్యర్థన చేశామని న్యాయవాది వివరించారు. దానిపై బెంచ్‌ జోక్యం చేసుకుంటూ కౌన్సెలింగ్‌ అంటే తెరిచి, మూసివేసేది కాదు, ఇదొక సుదీర్ఘ క్రమం. ఆ క్రమం 6న ప్రారంభమవుతోందని పేర్కొంది. మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌కు ఎంత సమయం పడుతుందని ప్రశ్నించగా దాదాపు వారం రోజులు వుంటుందని ఈ విషయంలో వాదనలు వినిపిస్తున్న లాయర్లు చెప్పారు. అయినా కౌన్సెలింగ్‌ను ఆపేది లేదని బెంచ్‌ స్పష్టం చేసింది. దీనిపై రెండు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని ఎన్‌టీఏ, కేంద్రం తరపు న్యాయవాదులను కోరారు.
ఎన్‌టీఏకు నిర్దిష్టంగా కొన్ని ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ విడిగా దాఖలైన మరో పిటిషన్‌పై కూడా బెంచ్‌ విచారించింది. జూన్‌ 23 తిరిగి నీట్‌ పరీక్షను నిర్వహించడానికి సంబంధించి ఎన్‌టీఏ వద్ద కొంత సమాచారం వుందని అది వెల్లడించాలని ఎన్‌టీఏను ఆదేశించాల్సిందిగా పిటిషనర్‌ కోరారు. దానిపై సమాధానం ఇవ్వాల్సిందిగా ఎన్‌టీఏ తరపు న్యాయవాదిని ఆదేశిస్తూ జులై 8న విచారణకు నిర్దేశించింది.
పరీక్షను తిరిగి నిర్వహించాలన్న అంశాన్ని లేవదీస్తూ దీనివల్ల మళ్లీ అభ్యర్ధులు ఒత్తిడికి లోనవుతారని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. మే 5 పరీక్షను పక్కకు పెట్టే అవకాశం వున్నపుడు అన్నీ పక్కకు పెట్టేయవచ్చని బెంచ్‌ వ్యాఖ్యానించింది. తన ఆనారోగ్యం కారణంగా మళ్లీ పరీక్షకు హాజరయేందుకు అనుమతించాలని ఒక అభ్యర్థి పెట్టుకున్న పిటిషన్‌ను కూడా సుప్రీం విచారించింది. 1563 మంది అభ్యర్థులకు తిరిగి పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే ఈ పిటిషనర్‌ తనను అనుమతించాలంటూ ఎన్‌టీఏను కోరారని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. తెలంగాణా హైకోర్టులో కూడా పిటిషనర్‌ రిట్‌ పిటిషన్‌ వేశారని తెలిపారు. దానిపై ఇంకా ఎన్‌టీఏ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు.