‘కావేరి’పై జోక్యానికి సుప్రీం నో

– ప్రతి 15 రోజులకు సీడబ్ల్యూఎంఏ, సీడబ్ల్యూఆర్‌సీల సమావేశం
– తమిళనాడు, కర్నాటకల జల వివాదంపై న్యాయస్థానం స్పష్టీకరణ
న్యూఢిల్లీ : తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య నెలకొన్ని కావేరీ జలాల వివాదంలో జోక్యానికి భారత అత్యున్నత న్యాయస్థానం నో చెప్పింది. కర్నాటక లేదా తమిళనాడుకు అనుకూలంగా జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బదులుగా రెండు పొరుగు రాష్ట్రాలకు నీటి భాగస్వామ్యం విషయంలో కావేరీ నీటి నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్‌సీ), కావేరీ నీటి నిర్వహణ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ల మిశ్రమ నైపుణ్యంపై కోర్టు ఆధారపడింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌ గవారు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కర్ణాటక నుంచి తమిళనాడుకు రోజువారీ నీటి ప్రవాహాన్ని 5,000 క్యూసెక్కులుగా నిర్ణయించేటప్పుడు సీడబ్ల్యూఎంఏ, సీడబ్ల్యూఆర్‌సీ పరిశీలించిన కావేరీ బేసిన్‌లో నీటి కష్టాలతో సహా వివిధ అంశాలు అసంబద్ధమైనవని గవారు చెప్పారు. రెండు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీటి ప్రవాహాన్ని సమీక్షించేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి సీడబ్ల్యూఎంఏ, సీడబ్ల్యూఆర్‌సీ క్రమం తప్పకుండా సమావేశమవుతున్నా యని కోర్టు పేర్కొన్నది. తమిళనాడు రాష్ట్రం తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, జి. ఉమాపతి వాదనలు వినిపించగా, కర్నాటక నుంచి సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ హాజరయ్యారు.