– నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
– విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పిటిషన్‌పై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
‘ఓటుకు నోటు’ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని బీఆర్‌ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాది, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్‌పై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి కోట్లు లంచంగా చూపి… అందులో అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ సండ్ర వెంకట వీరయ్యలతో రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు కేసుల విచారణ తెలంగాణలోని ప్రత్యేక న్యాయమూర్తి ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉంది. అయితే హైదరాబాద్ నుంచి ఈ కేసుల విచారణను తెలంగాణ వెలుపల మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేయాలని బీఆర్‌ఎస్ నేతలు, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహ్మద్ అలీ, కల్వకుంట్ల సంజరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది పి మోహిత్ రావు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ్ దవే, డి శేషాద్రి నాయుడు, న్యాయవాది మోహిత్‌లు వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి, హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఈ కేసులో వెంటనే ట్రయల్ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందని నివేదించారు. ఇప్పుడు విచారణ మొదలైతే… దానిపై ప్రభుత్వ పెద్దలు ప్రభావం చూపే అవకాశముందని వాదనలు వినిపించారు. ఈ వాదనలపై జోక్యం చేసుకున్న జస్టిస్ గవాయి… ఒకవేళ ట్రయల్ పై అలాంటి ప్రభావం ఉందనుకుంటే తాము ఎలా చూస్తూ ఉంటామని వ్యాఖ్యానించారు. అయితే ఈ కేసులో ట్రయల్‌ను నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పిటిషనర్ తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డిపై 88 క్రిమినల్ కేసులు నమోదైనట్టు తెలిపారు. పలు సందర్భాల్లో పోలీసులను బెదిరించేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ధర్మాసనానికి నివేదించారు. కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలమనీ, అలాగే ఈ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరారు. కాగా ఈ కేసు విచారణ బదిలీపై తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో స్పందించాలని పేర్కొంది.