న్యూస్‌క్లిక్‌ కేసులో ఢిల్లీ పోలీసులకు సుప్రీం నోటీసులు

Delhi Police in Newsclick case Supreme Noticesన్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్‌ కేసులో ఢిల్లీ పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులిచ్చింది. తమ అరెస్టును సవాలు చేస్తూ న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపక చీఫ్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్తా, హెచ్‌ ఆర్‌ విభాగం చీఫ్‌ అమిత్‌ చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద ఢిల్లీ పోలీసులు తమను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని కొట్టేయాలని కోరుతూ దాఖలుచేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బిఆర్‌ గవారు, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ కేసును అత్యవసర విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ ముందు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ప్రస్తావించారు. అయితే ఈ కేసు సోమవారం విచారణకు వచ్చినప్పుడు, ధర్మాసనం ఢిల్లీ పోలీసుల ప్రతిస్పందనను కోరుతూ రెండు పిటిషన్లకు సంబంధించి నోటీసు జారీ చేసింది.
పిటిషనర్ల తరపు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ ‘అరెస్టుకు సంబంధించిన ఆధారాలను రాతపూర్వకంగా అందించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన పంకజ్‌ బన్సల్‌ తీర్పును విస్మరించారు. అరెస్టు మెమో చూడండి. ఏమీ అందించలేదు’ అని పేర్కొన్నారు. జస్టిస్‌ గవారు జోక్యం చేసుకుని ‘సెలవు ముగిసిన వెంటనే మేం ఈ పిటిషన్‌ను తీసుకుంటాం’ అన్నారు. ‘వైద్య కారణాలపై మధ్యంతర ఉత్తర్వుల కోసం ఒక దరఖాస్తు కూడా ఉంది. పిటిషనర్‌ వయస్సు 71 సంవత్సరాలు’ అని పుర్కాయస్థ ప్రస్తుత వయస్సును ప్రస్తావిస్తూ కపిల్‌ సిబల్‌ ఎత్తి చూపారు. ప్రధాన పిటిషన్లతో పాటు మధ్యంతర ఉపశమనం కోసం దాఖలు చేసిన దరఖాస్తును కూడా అదేరోజు విచారిస్తామని జస్టిస్‌ గవారు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కు తెలిపారు.
న్యూస్‌క్లిక్‌ పై దాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు విజయవంతం
సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపు మేరకు న్యూస్‌క్లిక్‌ మీడియా సంస్థపై జరిగిన అన్యాయమైన దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలను విజయవంతంగా నిర్వహించినందుకు దేశవ్యాప్తంగా రైతులను అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) అభినందించింది. చారిత్రాత్మకమైన రైతుల ఉద్యమాన్ని అణగదొక్కే లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టారు. ఈ మేరకు ఏఐకేఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ ధావలే, విజూ కష్ణన్‌ ప్రకటన విడుదల చేశారు. ‘న్యూస్‌క్లిక్‌పై ఎఫ్‌ఐఆర్‌లో రైతుల ఉద్యమం దేశవ్యతిరేకమని, విదేశీ, తీవ్రవాద శక్తులు నిధులు సమకూరుస్తున్నాయని నిరాధారంగా ఆరోపించింది. నిబద్ధత, దేశభక్తి కలిగిన రైతుల పోరాటాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం ఇది. చారిత్రాత్మక ఉద్యమాల స్ఫూర్తితో రైతులు, వ్యవసాయం, మండీలు, ఆహార పంపిణీపై నియంత్రణను కార్పొరేట్‌ దిగ్గజాలకు అప్పగించడానికి రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాల వెనుక మోసపూరిత ఎజెండాను చూశారు” అని పేర్కొన్నారు.