న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో టీచర్స్ రిక్రూట్‌మెంట్‌్ స్కాంలో ప్రభుత్వ అధికారుల పాత్రపై సిబిఐ జరపాలని కోల్‌కత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. 25 వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కోల్‌కత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. 25,753 ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బందిని తొలగిస్తూ కోల్‌కత్తా హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. రిక్రూట్‌మెంట్ స్కాంపై సిబిఐ విచారణ జరిపించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. వీటిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ పిటీషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను మే 6కి వాయిదా వేసింది.
సందేశ్‌ఖలిపై సిబిఐ విచారణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? : బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న
సందేశ్‌ఖలిలో దురాగతాలపై సిబిఐ విచారణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. ‘ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడకు ఎందుకు వచ్చింది’ అని జస్టిస్ బిఆర్ గవై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులు ఎఎం సింఘ్వి, జైదీప్ గుప్తాలను ప్రశ్నించింది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు వ్యాఖ్యలు చేసిందని గుప్తా సమాధానం ఇచ్చారు. ‘అప్పడు హైకోర్టుకు వెళ్లి వ్యాఖ్యలను తొలగించండి.. ఇక్కడికి ఎందుకు వచ్చారు?’ అని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు. తదుపరి విచారణను జులైకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సందేశ్ ఖలిలో దురాగతాలపై సిబిఐ విచారణకు కోల్‌కత్తా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును బెంగాల్ ప్రభుత్వం ఆశ్రయించింది