ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌ను నియమించారు. శనివారం ఆ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శరద్ పవార్ ఈ నియామకాలు చేశారు. పవార్, పీఏ సంగ్మా కలిసి 1999లో ఎన్‌సీపీని స్థాపించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, ఉమన్ యూత్, లోక్‌సభ సమన్వయకర్తగా సుప్రియా సూలే బాధ్యతలు నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా వ్యవహారాలను ప్రఫుల్ పటేల్ చూసుకుంటారు. శరద్ పవార్ గత నెలలో ఎన్‌సీపీ చీఫ్ పదవికి రాజీనామా ప్రకటించగా, పార్టీ కార్యకర్తలు ఆ ప్రతిపాదను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పవార్ ఆ ఆలోచనను వెనక్కి తీసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్లను ఏర్పాటు చేసుకోవాలని పవార్‌కు పార్టీ ప్యానల్ సూచించింది. ఈ నేపథ్యంలో పవార్ తాజా నియామకాలు చేపట్టారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ టక్కర్‌కు ఒడిశా, పశ్చిమబెంగాల్, రైతులు, మైనారిటీ శాఖ బాధ్యతలు అప్పగించారు. నంద శాస్త్రిని ఢిల్లీ పార్టీ చీఫ్‌గా పవార్ ప్రకటించారు. కొత్త పదవుల్లో శదర్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్‌కు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడం విశేషం.