మణిపూర్‌ అల్లర్ల కట్టడికి సర్జికల్‌ స్ట్రైక్‌ కమాండర్‌

– ఎస్‌ఎస్‌పీగా రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌ నెక్టార్‌ సంజెన్‌బామ్‌
– అశాంతికి తెర దించేందుకు నియామకం అంటున్న కేంద్రం
– ఓ వర్గాన్ని టార్గెట్‌ చేయటానికేనంటున్న రాజకీయ పరిశీలకులు
ఇంఫాల్‌: మణిపూర్‌లో శాంతి పరిస్థితులు నెలకొనటం అంత సులువుగా కనబడటం లేదు. ప్రతిరోజూ ఎక్కడో చోట కాల్పుల మోతలు, మరణాలు వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావటానికి సర్టికల్‌ స్ట్రైక్‌ కమాండర్‌ , రిటైర్డ్‌ కల్నల్‌ నెక్టార్‌ సంజెన్‌బామ్‌ను కేంద్రం రంగంలోకి దింపింది. గతనెల 24న రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సీనియర్‌ సూపరింటెండెంట్‌(కోంబాట్‌)గా నియమించింది. ఐదేండ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. రాష్ట్రంలో దాదాపు మూడు నెలలకు పైగా కొనసాగుతున్న అశాంతికి ఇప్పటికీ తెర పడటం లేదు. పైగా రాజకీయంగా బీజేపీ ప్రభుత్వానికి సంకటంగా మారింది. దీంతో అత్యున్నత పురస్కారాలైన శౌర్యచక్ర, కీర్తి చక్ర గ్రహీత అయిన సంజెన్‌బామ్‌కు బాధ్యతలు అప్పగించింది. అయితే మోడీ ప్రభుత్వం కావాలనే..ఓ వర్గాన్ని టార్గెట్‌ చేయటానికే సంజెన్‌ బామ్‌ను నియమించిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.2015లో మయన్మార్‌లో భారత్‌ జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌లో సంజెన్‌ కీలక పాత్ర పోషించారు. ఆర్మీ అధికారిగా ఆయన 21 పారా(స్పెషల్‌ ఫోర్సెస్‌)లో పని చేశారు. జూన్‌ 12 నాటి క్యాబినెట్‌ నిర్ణయం తర్వాత నియామకం జరిగిందని మణిపూర్‌ జాయింట్‌ సెక్రెటరీ (హౌమ్‌) ఆగస్టు 28న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.