రంగుల ప్రపంచం… అందులోకి రావాలని పేరు ప్రఖ్యాతులు గడించాలని ఎందరో కలలు కంటుంటారు. మరికొందరు కేవలం ఊహాలోకానికే పరిమితమైతే, కొందరికి అనుకోకుండా అవకాశాలు వస్తాయి. అదే సినిమా రంగం. ఈ రంగంలోకి అడుగుపెట్టాలంటే కలలు కనడమే కాదు అవకాశాలు రావాలి. వాటి కోసం పగలనకా, రాత్రనకా కష్టపడాలి. మరీ ముఖ్యంగా మన వాళ్ళు ఎవరైనా ఈ రంగంలో ఉండి తీరాలి. అప్పుడే ఈ రంగంలో రాణించడం తేలికవుతుంది. అలాంటి రంగంలో తన నైపుణ్యంతో, స్వశక్తితో ఎదిగిన నటి సూర్యకాంతం. ఈ ఏడాది శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ రోజు ఆమె వర్థంతి సందర్భంగా మన తెలుగింటి గయ్యాళి అత్త పరిచయం నేటి మానవిలో…
అవకాశాల కోసం ఆశగా ఎదురు చూసే ఈ సినిమా ప్రపంచం కొన్ని ఏండ్ల కిందటే అంటే 1921లో ప్రారంభమయింది. అప్పటి నుండి ఎందరో నటి నటులు ఈ రంగంలోకి వచ్చారు. కొందరి నటులు గుర్తుండిపోతే, మరికొందరు శాశ్వతంగా చిరస్థాయిగా వారి పాత్రల ద్వారా మరచిపోలేని కీర్తిని గడించుకుంటారు. ఆ కోవలోకే వస్తారు సూర్యకాంతం.
నటించాలనే కోరికతో
సూర్యకాంతం అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకష్ణరాయపురంలో బ్రాహ్మణ కుటుంబంలో 1924 అక్టోబర్ 28వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులకు సూర్యకాంతం 14వ సంతానం. ఆరేండ్ల వయసులోనే పాటలు పాడటం, నాట్యం నేర్చుకున్నారు. చిన్నతనంలో హిందీ సినిమా పోస్టర్లు ఈమెను బాగా ఆకర్షించేవి. అప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఎక్కువై చెన్నై చేరుకున్నారు. సూర్యకాంతం అంటే గుర్తుకు వచ్చేది గయ్యాళి తనమే. ఎటువంటి పాత్రలో నైనా పరకాయ ప్రవేశం చేసి తన నటన ద్వారా ప్రేక్షుకుల మనసులో శాశ్వతంగా నిలిచిపోవడం ఆమెకే చెల్లింది.
లీలాకుమారి సాయంతో…
మొదటి సారి ఆమె జెమినీ స్టూడియో వారు నిర్మించిన ‘చంద్రలేఖ’ చిత్రం ద్వారా ఒక నర్తకిగా పరిచయం అయ్యారు. తర్వాత ‘ధర్మాంగదా’ చిత్రంలో మూగవేషం వేశారు. ఇలా చిన్న చిన్న పాత్రలు వేస్తూ నటి లీలాకుమారి సాయంతో మొదటిసారిగా ‘నారద నారది’ సినిమాలో సహాయ నటిగా చేశారు. అయితే ఎంత ప్రయత్నించినా చిన్న చిన్న పాత్రల్లోనే అవకాశాలు వచ్చేవి. ఇది నచ్చక జెమినీ స్టూడియో నుండి బైటకి వచ్చేసారు.
కుటుంబ పరిస్థితుల రీత్యా
హిందీ సినిమాల్లో నటించాలనే కోరిక ప్రగాఢంగా ఉండేది. ఆ కోరికతో బొంబాయి వెళ్లాలని అనుకున్నారు. అయితే కుటుంబ పరిస్థితుల రీత్యా వెళ్లలేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అలాంటి సమయంలోనే తను కలలుకంటున్న నాయిక పాత్ర ‘సౌదామిని’ చిత్రం ద్వారా వచ్చింది. అయితే ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం కోల్పోయారు. తిరిగి కోలుకున్నాక ‘సంసారం’ చిత్రంలో గయ్యాళి పాత్ర వచ్చింది. ఆ తర్వాత ఆమె వెను తిరిగి చూసుకోలేదు. ‘కోడరికం’ చిత్రం ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది.
మనసు సున్నితం
అప్పటి రోజుల్లో అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి – సూర్యకాంతం, రమణారెడ్డి – సూర్యకాంతం, ఎస్వీ రంగారావు- సూర్యకాంతం, గుమ్మడి- సూర్యకాంతం జంటలుగా నటించేవారు. వీరి నటనతో హాస్యాన్ని పండించే వారు. షూటింగుల్లో జోకులు చెప్పడం సూర్యకాంతం సరదాల్లో ఒకటి. షూటింగ్ విరామ సమయాల్లో అందరితోనూ సరదాగా కబుర్లు చెబుతూ నవ్వుతూ, నవ్విస్తూ తన మంచితనంతో ఎదుటివారి హదయాలను గెలుచుకునేవారు ఓ సినిమాలో నాగయ్యను నోటికి వచ్చినట్లు తిట్టాలి. ఆ షాట్ అయిపోయిన తర్వాత ఆయన కాళ్ళ మీద పడి క్షమించండి అని వేడుకున్నారు. ‘పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావుల’ అని నాగయ్య లేవనెత్తితే కన్నీళ్లు తుడుచుకున్నారు. నటిగా గయ్యాళిగా కనిపించే ఆమె మనసు ఎంత సున్నితమైనదో తెలుసుకునేందుకు ఇదొక చక్కటి ఉదాహరణ. దబాయింపు, కచ్చితత్వము ఉన్న మనిషే అయిన మనసు మాత్రం సున్నితం.
హృదయాల్లో నిలిచిపోయారు
గయ్యాళి తనంతో పాటు అమాయకత్వంను కూడా జోడించి నటించగలిగిన నటి సూర్యకాంతం. ఎడమ చేతిని ఝళిపిస్తూ, కుడి చేతిని నడుం మీద పెట్టుకుని ‘నీ జిమ్మడా, నీ మొహం మండ, నీ మొహం దొంగలు తొల, ఎక్కడ చచ్చ రుర్ర, అయ్యో అయ్యో మీకేం పోయే కాలం వచ్చిందిరా’ అనే డైలాగులు ప్రేక్షకుల హదయాల్లో నిలిచిపోయాయి. ‘అత్తా ఒకింటి కోడలే’ చిత్రంలో కూతురి పట్ల మమకారం, కోడలి పట్ల దురుసు ప్రవర్తన కలిగిన పాత్రలో ఎంతో బాగా నటించారు. ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమాలో రేలంగి భార్యగా నటించారు. అందులో భర్త తెచ్చిన పూలు పెట్టుకుని జడ వేసుకుని సిగ్గుపడే సీన్ ప్రేక్షకులకు నవ్వుతెప్పిస్తుంది.
నిజ జీవితంలో…
‘అదష్టవంతులు’ సినిమాలో పద్మనాభం తల్లిగా, పెసరట్ల పెరమ్మగా ఛాయాదేవితో గొడవ పడుతూ సై అంటే సై అంటూ హాస్యాన్ని పండించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సినిమాలు, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు. సినిమాల్లో గయ్యాళి పాత్రలు వేస్తూ సూర్యకాంతం అంటే గయ్యాళి అనే పేరు తెచ్చుకున్నారు. అయితే నిజ జీవితంలో మాత్రం ఆమె గొప్ప మానవతా వాదీ. చాలా ఓర్పు, సహనం కలిగిన మనిషి. అందరి మంచి కోరుకునేది. పది మందికి కడుపు నింపేది. షూటింగులకు వచ్చినప్పుడు ఇంటి నుండి ఏవో తినుబండారాలు తేవడం అందరికి పంచిపెట్టడం చేసేవారు.
చెరగని ముద్ర
సినిమా రంగ చరిత్రలో ఎంతో మంది నటి నటుల్ని చూసి ఉండవచ్చు. కానీ సూర్యకాంతం ఒక ప్రత్యేకం. ఆవిడలాంటి నటి ఇక రారు. సినిమాలలో అత్తారికాన్ని చేలాయించి ప్రేక్షకుల హదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారమే. ఒకే రకం పాత్రల్ని ఎక్కువ సినిమాల్లో నటించిన నటిగా గుర్తింపు పొందారమే. దాదాపు 750కి పైగా చిత్రాలలో నటించి ఎన్నో గుర్తుండి పోయే పాత్రల్లో వొదిగి పోయారామే. సూర్యకాంతం శత జయంతి వేడుకల సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ…
– పాలపర్తి సంధ్యారాణి