నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మండలం మంచిరేవుల గ్రామంలోని విశ్వభారతి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మెన్ రత్నారెడ్డి, నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ పి.సత్యబాబులకు గతంలో సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్ష అమలును హైకోర్టు డివిజన్ బెంచ్ నిలిపేసింది. కోర్టుకు ఇచ్చిన హామీ తర్వాత నిర్మాణాలు చేశారంటూ మిర్చుమల్ చెల్లారాం మంఘ్నాని దాఖలు చేసిన కోర్టుధిక్కార కేసులో వారికి ఆరు నెలల జైలు, రూ.రెండు వేలు చొప్పున జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. అప్పీల్ కోసం తీర్పు అమలును పది రోజులు సస్పెన్షన్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో దాఖలు చేసిన అప్పీళ్లను ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరధే ఆధ్వర్యంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది, కోర్టుకు హామీ ఇచ్చాక నిర్మాణాలు చేశారో లేదో తేల్చాలని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ వింగ్‌ను ఆదేశించింది. విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. రెండు ఎకరాల లీజు భూమిలో నిర్మాణాలకు అనుమతులు లేకపోవడంతో నార్సింగ్ మున్సిపాల్టీ వాటిని పాక్షికంగానే కూల్చిందనీ, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ రత్నారెడ్డి నిర్మాణాలు చేశారని కోర్టు ధిక్కరణ పిటిషనర్ వాదన.