వ్యక్తి అనుమానాస్పద మృతి

– న్యాయం చేయాలంటూ బంధువుల రాస్తారోకో
– సిఐ హామీతో నిరసన విరమణ
నవతెలంగాణ- ఆసిఫాబాద్
వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలోని అంకుశపూర్ లో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం అంకుశాపూర్ గ్రామానికి చెందిన పోల్కర్ సుధాకర్(45) ఆటో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ ఆటో పాయింట్ వద్ద క్రమ పద్ధతిలో ఆటోలను పంపించే పని చేసేవాడు గత శుక్రవారం తోటి ఆటో డ్రైవర్లు సాయి, జహంగీర్ తో కలిసి రెబ్బెన మండలం కైరిగాం గ్రామంలో మరో ఆటో డ్రైవర్ మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి తిరిగి వచ్చారు. గుండి రహదారిలో ఉన్న వైన్స్ వద్ద మద్యం సేవించి అక్కడి నుండి చిర్రకుంట రహదారిలోని వైన్స్ వద్ద మద్యం సేవించినట్లు తెలిపారు. అక్కడనుండి ఆటోలో బయలుదేరిన వీరు ఎటువైపు వెళ్లారో తెలియదని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వివరించారు. శనివారం నుండి సుధాకర్ కోసం కుటుంబ సభ్యులు గాలించి ఆదివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ లో సుధాకర్ కనిపించట్లేదంటూ కేసు పెట్టారు. అనంతరం మేకల కాపరులు ఆడ ప్రాజెక్టు వద్ద గుర్తు తెలియని శవం కనిపించినట్లు కుటుంబ సభ్యులకు తెలపడంతో పోలీసులను వెంటబెట్టుకుని ప్రాజెక్టు వద్దకు వెళ్లడంతో సుధాకర్ నీటిలో తెలియాడుతూ కనిపించారు. శవం పై కత్తి గాట్లు ఉండడంతో పాటు కావాలనే చంపినట్లు, బంధువులు గుర్తించినట్లు తెలిపారు. మృతుడికి భార్య సుజాత, ముగ్గురు కూతుళ్లు శిల్ప, సిరి, సీమ ఉన్నారు.
న్యాయం చేయాలంటూ బంధువుల రాస్తారోకో
సుధాకర్ ను కావాలనే చంపారంటూ నిందితులను వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలని లేదంటే రోడ్డుపై నుండి లేచేది లేదంటూ మృతుడి బావ ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్, అన్న కొడుకు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోల్కర్ సాయిరాం, మృతుడి భార్య సుజాత తో పాటు కూతుర్లు బంధువులు మృతుడి ఫోటోను పట్టుకొని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాదాపు గంటపాటు రోడ్డుపై వాహనాలు నిలిపివేశారు. బంధువుల ఆర్తనాధాలతో రోడ్డుపై రోదనలు మిన్నంటాయి.
సిఐ హామీతో నిరసన విరమణ
రాస్తారోకో దగ్గరికి చేరిన పట్టణ సీఐ జువ్వాజి సురేష్ బంధువులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఒక దశలో వారు నిరసన విరమించడానికి ఒప్పుకోకపోవడంతో వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. నిందితులను పట్టుకొని శిక్ష పడేలా చూస్తానని హామీ ఇవ్వడంతో బాధితులు రాస్తారోకో విరమిచ్చారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.