స్వచ్ఛభారత్‌ ఫలితమేది?

What is the result of Swachh Bharat?– ఎంపీలోని గిరిజన ప్రాంతాలలో దారుణం
– మరుగుదొడ్లు ఉన్నా.. లేనట్టే
– నీరు, తలుపులు లేకపోవటంతో నిరుపయోగంగానే
– మలవిసర్జనకు బయటకు వెళ్లాల్సిందే
– ఎస్సీ ప్రాంతాలలోనూ ఇవే పరిస్థితులు
– బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కారు పని తీరుపై అసంతృపి
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని గిరిజన కుగ్రామాల్లో స్వచ్ఛభారత్‌ మిషన్‌ పడకేసింది. ఈ కార్యక్రమం కింద పనులు ఆశించినంతగా జరగలేదు. అక్కడి మరుగుదొడ్ల శిథిలాలవస్థలో ఉన్నాయి. గత ఎనిమిదేండ్లలో బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌ మిషన్‌-గ్రామీణ్‌ క్షేత్రస్థాయిలో విఫలమైందని విశ్లేషకులు చెప్తున్నారు. బహిరంగ మలవిసర్జన లేకుండా, పరిశుభ్రతను సాధించేందుకు 2014, అక్టోబర్‌ 2న దేశవ్యాప్తంగా ప్రారంభింబడిన పథకం స్వచ్ఛభారత్‌ మిషన్‌. ఈ పథకం కింద వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. అయితే, మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో చాలా మరుగుదొడ్లకు తలుపులు, సెప్టిక్‌ ట్యాంకులు లేవు. మిగిలినవి స్వచ్ఛమైన నీరు లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. మరుగుదొడ్లు ధాన్యాలు, ఇతర వస్తువులను నిల్వ చేయటానికి, జంతువులకు ఆశ్రయం కల్పించటానికి ఉపయోగపడుతున్నాయని ఇక్కడి ప్రజలు తెలిపారు. తెల్లవారుజామున ప్లాస్టిక్‌ సీసాలు, మగ్‌లతో పురుషులు, చిన్న సమూహాలలో మహిళలు ఎక్కువగా సాయంత్రం తర్వాత లేదా తెల్లవారుజామున మలవిసర్జనకు వెళ్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని అక్టోబర్‌ 2 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్‌) ప్లస్‌గా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 2018లో ప్రకటించారు. అధికారిక సమాచారం ప్రకారం, 2022 నాటికి 50,279 గ్రామాల్లో 72 లక్షలకు పైగా మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. వాటిలో 49,994 ఓడీఎఫ్‌ ప్లస్‌గా ప్రకటించబడ్డాయి. రాష్ట్ర జనాభాలో గిరిజనులు 22 శాతం మంది ఉన్నారు. 89 గిరిజన బ్లాకులలో మరుగుదొడ్ల పరిస్థితి ఆశించినంతగా ఏమీ లేదు. గడిచిన ఎనిమిదేండ్లలో రూ.83,937.72 కోట్లతో 10.9 కోట్ల మరుగుదొడ్లు నిర్మించేందుకు కేంద్రం యోచించింది. అయితే, 2018-19 తర్వాత ఎస్సీ, ఎస్టీల మరుగుదొడ్ల వినియోగంలో ప్రపంచ బ్యాంకు, యేల్‌ యూనివర్శిటీలోని ఎకనామిక్స్‌ ఫ్యాకల్టీ రూపొందించిన పరిశోధనా పత్రం ఈ పథకం పురోగతిపై భారీ క్షీణతను చూపింది. ”అన్ని సమూహాలకు మరుగుదొడ్ల సాధారణ వినియోగం తగ్గింది. ఎస్సీ, ఎస్టీలో క్షీణత అతిపెద్దది. ఇతర వెనుకబడిన కులాలు, సాధారణ వర్గాలకు 9, 5 శాతం పాయింట్ల క్షీణతతో పోలిస్తే ఎస్సీలకు టాయిలెట్ల సాధారణ వినియోగంలో 20 శాతం తగ్గుదల, ఎస్టీలకు 24 శాతం పాయింట్ల తగ్గుదల ఉన్నది” అని పరిశోధనా పత్రం వివరించింది. దేశవ్యాప్తంగా 2018 నుంచి టాయిలెట్‌ వాడకంలో అసమాన క్షీణతను చూసిన ఏడు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ కూడా ఒకటి కావటం గమనార్హం.స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉన్న కొన్ని గిరిజన కుగ్రామాల్లో, టాయిలెట్లు రంగురంగుల చేతితో తయారు చేసిన పెయింటింగ్‌లను కలిగి ఉంటాయి, అయితే అవి స్త్రీలు మరియు బాలికలకు మాత్రమే కేటాయించబడటంతో పురుషులు బహిరంగ మలవిసర్జనకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్లు చాలా చిన్నవిగా నిర్మించటంతో అవి పేరుకు మాత్రమే ఉన్నాయనీ, వినియోగానికి మాత్రం అనుగుణంగా లేవని లబ్దిదారులు వాపోతున్నారు. రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న దళితుల ఆధిపత్యం ఉన్న కుగ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ”రాష్ట్రంలో 2018 నాటికి ఈ పథకం కింద నిర్మించిన 62 లక్షల మరుగుదొడ్లలో రూ.540 కోట్ల విలువైన 4.5 లక్షల మరుగుదొడ్లు కనిపించకుండా పోయాయి. బేతుల్‌లోని గిరిజన లక్కడ్జాం పంచాయతీలోని గ్రామస్థులు అప్రమత్తమై పరిపాలనను విచారణ ప్రారంభించాలని ఒత్తిడి చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది” అని కొన్ని కథనాలను చూపిస్తూ అక్కడి ప్రజలు వెల్లడించారు. కొన్నిచోట్ల నిర్మించిన మరుగుదొడ్ల ఫొటోలను సమర్పించిన అధికారులు ప్రాజెక్టుకు కేటాయించిన నిధులను స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. కాగా, మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్‌ ప్రకారం రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం విదితమే.