మరణించిన వారి పేరుతో పింఛన్లు స్వాహా

 13 మంది పేర్లతో రూ.2,86,176 లక్షలకు పైగా సొమ్ము దుర్వినియోగం విచారణలో వెలుగులోకి..
నవతెలంగాణ-దంతాలపల్లి
అర్హులైన నిరుపేద వృద్ధులు, దివ్యాంగులకు ఆసరాగా ఉండేలా ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న ఆసరా పింఛన్లను కొందరు అక్రమంగా స్వాహా చేస్తున్నారు. దివ్యాంగులకు నెలకు 3016 రూపాయలు, మిగతా వారికి నెలకు 2016 రూపాయల చొప్పున ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తుంది. పంపిణీ ప్రక్రియ తపాలా శాఖకు అప్పగించగా సిబ్బంది గ్రామాల్లో డబ్బులను అందిస్తున్నారు. కాగా మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలో మరణించిన వారి పేరుతోనూ పింఛన్లు సంవత్సరాల తరబడి తీసుకుంటున్నట్టు అధికారుల విచారణలో తేలింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి..
గున్నేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రెండు శివారు గిరిజన తండాలున్నాయి. జనాభా 2130 కాగా, సుమారు 1500 మంది ఓటర్లు ఉన్నారు. ఆసరా పథకం ద్వారా నెలకు 308 మందికి పింఛన్లు అందుతున్నాయి. వీరిలో వృద్ధాప్య 144, వితంతు 112, దివ్యాంగులు 28, కల్లుగీత కార్మికులు 11, చేనేత 1, ఒంటరి మహిళలు 12 మంది ఉన్నారు. వేలిముద్రలు పడని వారికి పంచాయతీ కార్యదర్శి వేలిముద్రల ద్వారా పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించారు. వీరిలో రెండేండ్ల నుంచి సుమారు 28 మంది వివిధ కారణాలతో మృతిచెందారు. గ్రామంలో మృతిచెందిన వారి పేర్లను పంచాయతీ మరణ ధృవీకరణ రిజిస్టర్‌లో నమోదు చేయాలి. పింఛన్‌ లబ్దిదారులు మృతిచెందితే వారి పేర్లను తొలగించాల్సి ఉన్నప్పటికీ అలాంటివేమీ చేపట్టలేదు. వీరిలో కొందరి పేరిట వస్తున్న పింఛన్లు స్వాహా అవుతున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మండల పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణంలో శనివారం విచారణ చేపట్టారు. గున్నేపల్లి గ్రామానికి కేటాయించిన బయోమెట్రిక్‌ యంత్రాల సహాయంతో 13 మంది పేర్లతో రూ.2,86,176 లక్షలకు పైగా సొమ్ము దుర్వినియోగమైనట్టు మండల పంచాయతీ అధికారి అప్సర్‌ పాషా విచారణలో తేలింది. ఇంకా 15 మంది చనిపోయిన వారి ఆధార్‌ కార్డు, మరణించిన తేదీ, పెన్షన్‌ ఐడి నెంబర్‌ అందుబాటులో లేని కారణం చేత విచారణ కాలేదని అధికారులు తెలిపారు. 15 మంది మరణించిన వారి పూర్తి సమాచారంతో నివేదిక తయారు చేసి కలెక్టర్‌కి ఇవ్వనున్నట్టు పంచాయతీ అధికారి తెలిపారు. ఈ విచారణ సమయంలో సర్పంచ్‌ గండి వెంకట్‌ నారాయణ గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు ఉన్నారు.