హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌

Swaminathan is the father of Green Revolution– ఆయన మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటు: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌
నవతెలంగాణ-ముషీరాబాద్‌
హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌ స్వామినాథన్‌ మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ అన్నారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంఎస్‌ స్వామినాథన్‌ సంస్మరణ సభ జరిగింది. టి.సాగర్‌, సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహ్మారెడ్డి, ప్రొఫెసర్‌ ఆరిబండి ప్రసాదరావు హాజరై స్వామినాథన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టి.సాగర్‌ మాట్లాడుతూ.. 1960లో అధిక దిగుబడినిచ్చే గోధుమలు, వరి రకాలను అభివృద్ధి చేయడంలో, ప్రచారం చేయడంలో స్వామినాథన్‌ కీలక పాత్ర పోషించారని చెప్పారు. 2004లో జాతీయ కమిషన్‌ అధ్యక్షుడిగా స్వామినాథన్‌ పంటలకు కనీస మద్దతు ధర అందించాలని సిఫార్సు చేశారన్నారు. ఉత్పత్తి సమగ్ర వ్యయం 50 శాతానికి సమానంగా ఉండాలని చెప్పారన్నారు.
కానీ, చారిత్రాత్మకమైన రైతుల పోరాటంలో ఇది ఒక ముఖ్యమైన డిమాండ్‌గా మిగిలిపోయిందన్నారు. మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇంకా అమలు కాలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులపాటు సంస్మరణ సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, మూడు శోభన్‌, బొంతు రాంబాబు, మాదినేని రమేష్‌, నున్న నాగేశ్వరరావు, వి.వెంకటేశ్వర్లు, మాటూరి బాలరాజ్‌, కనకారెడ్డి, సోమయ్య, భూక్య చందు, మధుసూదన్‌ రెడ్డి, శెట్టి వెంకన్న, ఈసంపల్లి బాబు, వర్ణ వెంకటరెడ్డి, ఎం.శ్రీనివాస్‌, డి.బాల్‌ రెడ్డి, సత్తిరెడ్డి, యాదవ రెడ్డి, సారంపల్లి భాగ్యలక్ష్మి, చీరిక అలివేలు పాల్గొన్నారు.