– స్వర్ణకారులకు చేయూతనందించాలి
– స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు వింజమూరి రాఘవాచారి
– ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మహాధర్నా
నవతెలంగాణ – ముషీరాబాద్
కార్పొరేట్ జ్యువెలరీ షాప్‌ల మూలంగా ఉపాధి కోల్పోతున్న స్వర్ణకారులకు చేయూతనందించాలని, స్వర్ణకార వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు వింజమూరి రాఘవాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడితే చేతివృత్తులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని భావించి ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన స్వర్ణకారులకు.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. కార్పొరేట్ తరహాలో నూతన జ్యువెలరీ షోరూంలు విరివిగా ఏర్పడటంతో స్వర్ణకార కుటుంబాలకు పనుల్లే రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల కాలంలోనే సుమారు 10 కుటుంబాల్లో 14 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ఐదు మెన్ కమిటీ రిపోర్ట్స్‌ను యథాతథంగా అమలు చేసి తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగా ఇక్కడా స్వర్ణకార వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. జీవో 272 లోపాలను సవరించి.. పటిష్టంగా అమలు చేయాలని, స్వర్ణకారులపై పోలీసు వేధింపులను అరికట్టాలని అన్నారు. పుస్తె, మెట్టెలు, ప్రధాన ఉంగరాలు, లక్ష్మీ రూపులు తదితర పనులను స్వర్ణకారులే చేసే విధంగా.. జ్యువెలరీ షాపుల్లో వాటిని అమ్మకుండా ప్రభుత్వం జీవో తీసుకురావాలని కోరారు. స్వర్ణకార వృత్తి చేస్తూ అకాల మరణం చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, స్వర్ణకారులకు రూ.5000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నాలో స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు రామదాసు లక్ష్మణాచారి, రవి ప్రశాంత్‌చారి, రాష్ట్ర కార్యదర్శి రాగిఫణి, సతీష్ చారి, ప్రచార కార్యదర్శులు నాగరాజు చారి, సతీష్ చారి, పోతులూరి చారి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణకారుల భారీ ర్యాలీ… సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నవతెలంగాణ-చెన్నూర్
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్వర్ణకారులు సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో భారీ రాలీ నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్ రోడ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్వర్ణకారులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కార్పొరేట్ సంస్థలు, షాపుల్లో ఆభరణాలను విక్రయించడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వర్ణకారులు ఉపాధిలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివాహ కార్యక్రమాలకు వినియోగించే పుస్తె, మట్టెలు, ప్రధాన ఉంగరాలు తదితర వస్తువులు స్వర్ణకారులే చేయడం ఆచారంగా వస్తోందన్నారు. వాటిని కూడా కార్పొరేట్ సంస్థలే విక్రయిస్తుండటంతో తమకు పనిలేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయ ఆభరణాలైన పుస్తె, మట్టెలు, ఉంగరాలు, ముఖ్యమైన వాటిని స్వర్ణకారులు మాత్రమే తయారు చేసే విధంగా ప్రభుత్వం జీఓ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. స్వర్ణకారుల సంక్షేమానికి ప్రభుత్వం భరోసా కల్పించి తమ వృత్తిని పరిరక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకూరి సందీప్ పాల్గొన్నారు.