మయన్మార్‌పై ఊగిసలాట

న్యూఢిల్లీ : మయన్మార్‌లో 2021 నుంచి అమలులో ఉన్న అత్యవసర పరిస్థితిని సైన్యం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. దీంతో ఇప్పట్లో అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం లేదని తేలిపోయింది. ఓ వైపు మయన్మార్‌లో అస్థిరత, మరోవైపు దక్షిణ, ఆగేయాసియా ప్రాంతంలో పెరుగుతున్న చైనా భౌగోళిక-రాజకీయ ప్రభావం నేపథ్యంలో తాజా పరిణామాలపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఓ వైపు మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతూనే మరో వైపు అక్కడి సైనిక ప్రభుత్వం పట్ల మోడీ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోంది. తక్షణ లక్ష్యాలను సాధించుకోవడానికే భారత ప్రభుత్వం ఊగిసలాట వైఖరిని ప్రదర్శిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
మయన్మార్‌లో నెలకొన్న అస్థిర పరిస్థితులపై భారత్‌ భద్రతాపరమైన ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా సరిహద్దు వెంబడి నెలకొన్న అస్థిరత మన దేశాన్ని కలవరపరుస్తోంది. చైనా, మయన్మార్‌ సైనిక పాలకుల మధ్య సంబంధాలు సంక్లిష్టంగానే ఉన్నప్పటికీ బలంగానే కొనసాగుతున్నాయి. మయన్మార్‌ సైనిక ప్రభుత్వాన్ని చైనా సమర్ధిస్తోంది. అంతేకాక మయన్మార్‌ సైన్యానికి ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఈ పరిణామాలను భారత్‌ తేలికగా తీసుకోవడం లేదు. మయన్మార్‌తో భారత్‌ సంబంధాలు ఇటీవలే మెరుగుపడ్డాయి. మయన్మార్‌కు చెందిన కోకో దీవులలో చైనా నిఘా వ్యవస్థ ను ఏర్పాటు చేయడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అండమాన్‌ నికోబార్‌ దీవులకు ఈ వ్యవస్థ కేవలం 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
మయన్మార్‌లో తక్షణమే పోరాటాన్ని నిలిపివేయాలంటూ ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌ జరిగినప్పుడు భారత్‌ గైర్హాజరైంది. అంతేకాక ప్రభుత్వ సంస్థలు సహా పలు భారత కంపెనీ లు మయన్మార్‌ సైన్యానికి, ఆయుధ డీలర్లకు ఆయుధాలు, ముడి పదార్థాలు సరఫరా చేశాయి. ఏదేమైనా మయన్మార్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ గురించి మాట్లాడుతూనే సైనిక పాలకులకు మద్దతు తెలపడం భారత ప్రభుత్వ ఊగిసలాట వైఖరికి నిదర్శనమని పరిశీలకులు వ్యాఖ్యానించారు.