జతుల నిర్మాణంపై అవగాహన కార్యక్రమం సద్వినియోగం చేసుకోండి: డైరెక్టర్ పద్మ కళ్యాణ్

నవతెలంగాణ – హైదరాబాద్
సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ సగర్వ సమర్పణలో ప్రముఖ నాట్య గురువు సంగీత నాటక అకాడెమీ అవార్డీ గ్రహీత పసుమర్తి రామలింగ శాస్త్రి రెండు రోజుల వర్క్ షాప్ లో భాగంగా శనివారం మొదటి రోజు కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా జతుల నిర్మాణం గురించి నృత్య విద్యార్థులకు ఆయన సోదహరణంగా వివరించారు. ప్రతీ నర్తకితోనూ గురు రామలింగ శాస్త్రి నాట్య పరిబాషలో జతుల ప్రాధాన్యత వాటి శాస్త్రీయ విశిష్టతను వివరించి చెప్పారు. ఈ సందర్భంగా సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ డైరెక్టర్ పద్మా కళ్యాణ్ మాట్లాడుతూ తన వద్ద కూచిపూడి నృత్యాన్ని అభ్యసించిన విద్యార్థులే కాక రిజిస్ట్రేషన్ చేసుకున్న యితర నృత్య విద్యార్థినిలు ఈ వర్క్ షాప్ లో పాల్గొని జతుల నిర్మాణం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం వారిని మరింత క్రమశిక్షణ వృత్తి నైపుణ్యంతో తీర్చిదిద్దుతుందని అభిప్రాయ పడ్డారు. రెండు రోజుల వర్క్ షాప్ లో భాగంగా ఆదివారం కూడా మరింత మంది వర్క్‌షాప్ లో పాల్గొని సద్వినియోగం చేసకోవాలని సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ డైరెక్టర్ పద్మ కళ్యాణ్ తెలియజేశారు.