వర్షాకాలం…జాగ్రత్తలు తీసుకోండి

– పురపాలకశాఖపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్టీల పరిధిలో వర్షాకాల సన్నద్ధత ఏర్పాట్లు చేసుకోవాలని ఆ శాఖ మంత్రి కే తారకరామారావు అధికారుల్ని ఆదేశించారు. దీనికి సంబంధించి ఆయా పురపా లికల ప్రణాళికల్ని పరిశీలించారు. మంగళవారం నాడాయన పుర పాలక శాఖలోని వివిధ విభాగా ల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమా వేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని మున్సిపాల్టీల పరిధితో పాటు హైదరా బాద్‌ నగరంలో వర్షాకాలంలో ఎదురయ్యే ఏలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొ నేందుకు సిద్దంగా ఉండాలని చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాల న్నారు. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ ఎమ్‌సీ) తోపాటు అన్ని పురపాలికల్లో నాలాల సేఫ్టీ ఆడిట్‌ని పూర్తి చేశామ న్నారు. జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. చెరువుల్లో నీటి నిల్వ స్థాయిల్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రారంభించిన వార్డు కార్యాలయాల పనితీరును సమీక్షించారు. పౌరులు విస్తృతంగా ఇక్కడి సేవల్ని వినియోగించుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పలువురు నగర పౌరులతో ఫోన్లో మాట్లాడారు. జీహెచ్‌ఎమ్‌సీకి వివిధ సమస్యలపై ఫిర్యాదు చేసిన వారతో ఆయా సమస్యల పరిష్కారం జరిగిన తీరు, ఎదురైన అనుభవాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జలమండలి ప్రాజెక్టులు, ఉచిత నీటి సరఫరా, ఫిర్యాదుల పరిష్కారం అంశాలనూ సమీక్షించారు. కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.