ఆరోగ్యం జాగ్రత్త తల్లీ…

– పియ్రమైన వేణు గీతికకు
నాన్న ఎలా ఉన్నావ్‌? చలి కాలం మొదలైంది. అసలే నువ్వు చలి ఎక్కువగా ఉండే ఉత్తర భారతదేశంలో ఉన్నారు. కాస్త జాగ్రత్తగా ఉండు. శరీరాన్ని వెచ్చగా స్వేట్టర్‌తో కప్పి ఉంచుకో. కాళ్లకు మేజోళ్లు వేసుకో. ఎముకలు కొరికే చలి అంటారు కదా! అలా ఉంటుంది తీవ్రంగా. కాబట్టి అసలు నిర్లక్ష్యం చేయకూడదు. అమ్మ ఎప్పుడు ఆరోగ్యం గురించి, ఆహారం గురించి చెప్తూ ఉంటుంది అని విసుక్కోకు తల్లీ. ఎందుకంటే నీకు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఎక్కువ. గుర్తుండే ఉంటుంది ఇంజనీరింగ్‌ చదవడానికి వెళ్ళినప్పుడు చదువు మీద దృష్టి పెట్టావు కానీ ఆహారం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశావు. ‘తినటానికి టైం లేదు, కాలేజీకి వెళ్ళాలి, క్లాసులు మిస్‌ అవుతాను’ అంటూ వెళ్లిపోయే దానివి. ఒక రోజు బీపీ డౌన్‌ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయావు. నీ ఫ్రెండ్స్‌ చెప్తే కానీ నాకు తెలియలేదు.
నిన్ను చూద్దామని వస్తే గుర్తు పట్టలేని విధంగా మారిపోయావు. నా కండ్ల నుండి నీళ్లు ఆగలేదు. నిన్ను వెంటనే డాక్టర్‌ దగ్గరకి తీసుకెళ్లి చూపిస్తే 10 రోజులు విశ్రాంతి అవసరమంటే కాలేజీ వాళ్లకు మెడికల్‌ సర్టిఫికెట్‌ ఇచ్చి నిన్ను తీసుకొచ్చాను. ఆ తర్వాత అయిన కొంచం శ్రద్ధ పెడతావనుకున్నాను. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత ‘పొద్దున్నే వెళ్ళాలి, తినటానికి సమయం లేదు, రాత్రి వచ్చేసరికి బాగా ఆలస్యం అవుతుంది’ అంటున్నావు. ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటున్నావు తప్ప ఆరోగ్యానికి కావాల్సిన ఆహారం తీసుకోవడం లేదు. ఇంటికి వచ్చినప్పుడు రక్త పరీక్షలు చేయిస్తే విటమిన్లన్నీ పడి పోయాయి అని రిపోర్ట్‌ వచ్చింది. అప్పుడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎంత అవసరమో, తీసుకోవాల్సిన ఆహారం, ఏ సమయంలో తీసుకోవాలో వివరంగా చెప్పాను. నేను నీ దగ్గర కొన్నాళ్ళు ఉన్నాను. కొంచం కోలు కున్నావు. ఇప్పుడు కూడా అదే డైట్‌ కంటిన్యూ చేస్తున్నావు.
ఇన్నాళ్లకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వచ్చినందుకు చాలా సంతోషం. చక్కగా నీకు కావాల్సిన ఆహారం వండు కుంటున్నావు. పళ్ళు, పాలు, పెరుగు, డ్రై ఫ్రూట్స్‌, తీసుకుంటున్నావు. నీ శరీరానికి కావలసిన విటమిన్స్‌ అందుతున్నాయి. ఇలాగే శ్రద్ధ వహించు. ఒకటి గుర్తు పెట్టుకో నాన్న… నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా చేయగలవు. పదిమందిని చూసోగలవు. నీ కుటుంబ, ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలంటే ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి.
ఇంకొక ముఖ్య విషయం శరీరం మీద ఎక్కడైనా ఒక మచ్చ, కురుపు, దద్దు, రాష్‌ లాంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదిం చడం మంచిది. తరచుగా తలనొప్పి, కడుపునొప్పి, కళ్లు తిరగటం, తిన్న ఆహారం అరగక పోవడం మొదలైనవి ఉన్నా అలక్ష్యం చేయ కుండా డాక్టర్‌ దగ్గరకు వెళ్లి చూపించు కోవాలి. ఒక్కో సారి మన ఊహకు అందనివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితు ల్లోనూ అలక్ష్యం చేయకుండా ఉండాలి నాన్న. ఇవన్నీ నీ మంచికే చెప్తున్న తల్లి. పిజ్జాలు, బర్గర్లు, కూల్‌ డ్రింక్స్‌ ఇవేవీ ఆరోగ్యాన్ని ఇవ్వవు. వీటివల్ల ఆరోగ్యం పాడైపోతుంది. ముఖ్యంగా మంచి నీళ్ళు ఎక్కువ తాగాలి. మంచి నీళ్ళు శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ని బైటకి పంపిస్తాయి. చర్మాన్ని కాంతి వంతం చేస్తాయి. ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది. వీటన్నింటితో పాటు తగిన నిద్ర, విశ్రాంతి కూడా ఉండాలి. సెలవు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకో. మనిషి చురుకుగా ఉండాలంటే ఇవి చాలా ముఖ్యం. నీ గురించి, ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధ తీసుకుని మాకు సంతోషాన్ని కలిగిస్తావని ఆకాంక్షిస్తూ…
ప్రేమతో అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి