పంటలు ఎండిపోతున్నాయి…పట్టించుకోండి

Crops are drying up...watch out– ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
విద్యుత్‌ లేకపోవడంతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు అందోళనకు గురవుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్‌ 24 గంటల కరెంట్‌ ఇస్తానని మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందన్నారు. 24గంటల కరెంట్‌ ఇస్తున్నట్టు ప్రభుత్వం నిరూపిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. కడవరకూ పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పారు.’పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్‌సీ పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 15వ తేదీన ఇస్తున్నారు. ఝార్ఖండ్‌లో ఒకటో తేదీనే జీతాలు పడతాయని గుర్తు చేశారు. రాష్ట్ర మంత్రులు నాతో వస్తే కర్ణాటకలో అమలవుతున్న పథకాలు చూపిస్తా. స్పెషల్‌ ఫ్లైట్‌ పెడతాను. ఏపీ, కర్ణాటకలో బీఆర్‌ఎస్‌ ఎందుకు పోటీ చేయదు?’ అని ప్రశ్నించారు.ప్రభుత్వ హామీని నమ్మి లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే సగం ఎండిపోతున్నాయని చెప్పారు. ఎక్కడ కూడా 14 గంటలు మించి కరెంట్‌ ఇవ్వడం లేదన్నారు. ఏ సబ్‌ స్టేషన్‌కు రమ్మంటావో చెప్పు…చర్చకు సిద్ధమంటూ మంత్రులు. కేటీఆర్‌, హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవడం ఖాయమన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెపుతామని హెచ్చరించారు.అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.