టీనేజ్‌లో పిల్లలు వివిధ రకాల భావోద్వేగాలకు లోనవుతారు. ఆనందం, ఒంటరితనం, చికాకు, కోపం.. వంటి మూడ్ స్వింగ్స్ వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఒక్కోసారి చిన్న విషయాలకే తీవ్రంగా స్పందిస్తూ కోపంగా మాట్లాడతారు. ఇలాంటి సమయాల్లో తల్లిదండ్రులు వారికి అండగా నిలవాలి. వారిని అర్థం చేసుకుంటూ, ప్రవర్తన మార్చుకునేలా సర్ది చెప్పాలి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి పెద్దవాళ్లు కొన్ని పద్ధతులు పాటించాలి. అవేంటంటే…
కోప్పడకుండా… : అప్పటికే కోపంగా ఉన్న టీనేజర్లను తిట్టడం, కొట్టడం వల్ల వారు మరింత తీవ్రంగా స్పందిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు వారిపై ప్రతాపం చూపించకుండా పిల్లల కోపాన్ని బయట పెట్టనివ్వండి. అవసరమైతే వారితో విడిగా మాట్లాడండి. లేదంటే కొంత సమయం తర్వాత ఏం జరిగిందని ప్రశాంతంగా అడగండి. ఇలా చేయడం వల్ల వారిని అర్థం చేసుకున్న భావన కల్పిస్తూ, పిల్లల కోపాన్ని తగ్గించవచ్చు.
అడిగినవన్నీ ఇవ్వొద్దు… : చిన్నప్పటి నుంచి పిల్లలు అడిగినవన్నీ ఇస్తుంటే ఆ ప్రభావం టీనేజ్‌లో వారిపై పడుతుంది. వారు కోరిన వాటికి అడ్డు చెబితే పెద్దయ్యాక కూడా కోప్ప డతారు. ఈ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే పిల్లలకు అడిగినవన్నీ ఇవ్వకూడదు. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్లు వారికి అన్ని విషయాలూ అర్థమయ్యేలా చెబితే ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా జాగ్రత్త పడవచ్చు.
సందర్భానుసారం మాటలు : పిల్లలు మీతో ఏదైనా విషయంపై కోపంగా వాదిస్తున్నప్పుడు దానికి ఎక్కడ, ఎలా ముగింపు పలకాలో తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల వారు శాంతిస్తారు. ఆ తర్వాత మరోసారి అదే అంశం గురించి వివరణ అడగాలి. మరోసారి ఇలాంటివి ఎదురుకావని వారి నుంచి హామీ తీసుకోవాలి.
చెప్పేది వినాలి : టీనేజర్లు పెద్దవాళ్లపై కోపంతో, ఎక్కువగా మాట్లాడకుండా తమ పని తాము చేసుకుపోతుంటే ఏం జరిగిందో తెలుసుకోవాలి. వారితో మనసు విప్పి మాట్లాడాలి. కోపానికి కారణాలను అడగాలి. ఆపద సందర్భాల్లో వారికి అండగా ఉంటామనే భరోసానివ్వాలి. కోపాన్ని అరికట్టడానికి ఉపాయాలు, మార్గాలను ఉపయోగించాలి. పెద్దవాళ్ల పనుల్లో సాయం చేయమని సావధానంగా చెప్తూ ఉండటంతో పాటు, చేసేలా ప్రేరేపించాలి. వారితో కలిసి వ్యాయామం చేయడం, ఆటలు ఆడటం వంటివి చేయడం వల్ల సంబంధాలు బలోపేతమవుతాయి.
పరిమితి : పిల్లలను సరైన మార్గంలో పెట్టడానికి మామూలుగా తిట్టడం, కొట్టడం మంచిదే. కానీ ఎలాంటి సందర్భాల్లో వారిపై కోపం మంచిదో పెద్దవాళ్లు తెలుసుకోవాలి. తల్లిదండ్రులు కోపానికి పరిమితులను విధించుకోవాలి. అకారణంగా పదేపదే యుక్త వయసుకు వచ్చిన వారిని తిడుతూ ఉంటే, వారు మీకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా తయారవుతారు. సరైన సమయంలో సరైన విధంగా పిల్లలతో ప్రవర్తించడం వల్ల వారి కోపాన్ని అదుపులో ఉంచవచ్చు. అన్ని విషయాలు అర్థమయ్యేలా వారికి వివరించవచ్చు.