పక్కదారి పడుతున్న సుంకాలు

– నిబంధనకు మోడీ సర్కార్‌ పాతర..కాగ్‌
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ఖాతాపై (ఫైనాన్స్‌ అకౌంట్‌) కాగ్‌ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన నివేదిక ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టింది. ప్రజల నుంచి వసూలు చేసే ఆరోగ్య, విద్యా సుంకంలో 4 శాతం నిధులను ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా నిధికి జమ చేస్తామని 2018 బడ్జెట్‌ ప్రసంగంలో ప్రభుత్వం తెలిపింది. అయితే ఆ హామీని నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని కాగ్‌ వేలెత్తి చూపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రజల నుండి సుంకాల రూపంలో వసూలు చేసిన రూ.23,874.85 కోట్ల రూపాయలను రిజర్వ్‌ ఫండ్‌కు బదిలీ చేయలేదని, దీంతో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా నిధి (పీఎంఎస్‌ఎస్‌ఎన్‌), మాధ్యమిక్‌ అండ్‌ ఉచత్తర్‌ శిక్షా కోశ్‌ (ఎంయూఎస్‌కే)కు సొమ్ము జమ కాలేదని తెలిపింది. నిర్దిష్ట రిజర్వ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయనప్పుడు ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును స్థూల బడ్జెటరీ మద్దతుకు ఉపయోగిస్తున్నారని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. 2018-19 నుండి దేశ పౌరులు తమ కర్తవ్యంగా ఆరోగ్య, విద్యా సుంకాలను చెల్లిస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం రిజర్వ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయకుండా ఆ మొత్తాన్ని తన వెసులుబాటును బట్టి కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లోనే ఉంచుతోంది. కేంద్ర ప్రభుత్వం 2017లో ఎంయూఎస్‌కేను, 2021లో పీఎంఎస్‌ఎస్‌ఎన్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ రెండూ 2022 మార్చి నుండే అమలులో లేవు. దీనికి కారణం వాటికి సంబంధించిన ఖాతా ప్రక్రియలు ఖరారు కాకపోవడమే. 2021-22లో ఆరోగ్య, విద్యా సుంకం కింద రూ.52,732 కోట్లు వసూలు కాగా అందులో 60% మొత్తాన్ని ప్రాథమిక్‌ శిక్షా కోశ్‌కు బదిలీ చేశారు. సవరించిన అంచనాల ప్రకారం ఎంయూఎస్‌కేకు రూ.25 వేల కోట్లు, పీఎంఎస్‌ఎస్‌ఎన్‌కు రూ.21,499 కోట్లు బదిలీ చేసేందుకు అనుమతించారు. ప్రభుత్వ ఖాతాలలో ప్రత్యేక అకౌంటింగ్‌ పద్దులను ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోందని, సుంకం వసూళ్లను బదిలీ చేయడం లేదని కాగ్‌ విమర్శించింది. ప్రభుత్వ వ్యవహారాలలో ఆర్థిక జవాబుదారీతనం, పారదర్శకత అవసరమని నొక్కి చెప్పింది. ఏదేమైనా ప్రజల నుండి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న ఆరోగ్య, విద్యా సుంకాలు ఏమైపోతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు.