ప్రలోభాలకు పన్ను చెల్లింపు సొమ్ము

Taxpayer money for temptation– కేంద్రానికి ‘సుప్రీం’ నోటీసులు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీం కోర్టు లో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఉచితాల విషయంలో పన్ను చెల్లింపుదారుల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, దీన్ని నిరోధించేందుకు సమగ్ర మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్‌దారు అభ్యర్థించారు. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే పిల్‌పై సమాధానం
తెలియజేయాలంటూ.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, ఆర్బీఐలకూ నోటీసులు జారీ చేసింది.
‘ఎన్నికలకు ముందు ప్రభుత్వం నగదు పంపిణీ చేయడం కంటే దారుణం మరొకటి ఉండదు. ఇది ప్రతిసారీ జరుగుతోంది. చివరకు పన్ను చెల్లింపుదారులపై ఈ భారం పడుతోంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు పన్ను చెల్లింపుదారుల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాయి’ అని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లను,ఎన్నికల కమిషన్‌,ఆర్బీఐలను నాలుగు వారాల్లోపు స్పందించాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లతోపాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలలో మరికొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.