– రోగి కుటుంబీకుల పైనా దృష్టిని పెట్టాలి
– ఈ వ్యాధి ఇప్పటికీ ఒక సవాలే
– ఆరోగ్య, వైద్య నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ : భారత్‌లో క్షయవ్యాధి నియంత్రణలో మోడీ సర్కారు ఆశించిన లక్ష్యాలను సాధించలేకపోతున్నది. టీబీ నిరోధానికి విధించిన డెడ్‌లైన్ సమీపిస్తున్న తరుణంలో కేంద్రం పనితీరుపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీబీ నియంత్రణ అంటే వ్యాధిని నిరోధించే వైపుగా చర్యలు చేపట్టాలి కానీ వ్యాధిన బారిన పడిన వారిని లెక్కించకుండా గణాంకాల ద్వారా తప్పించుకోవాలని చూడటం కాదని చెప్పారు. భారత్‌లో టీబీ వ్యాధి అనేది ఇప్పటికీ ఒక పెద్ద సవాలుగానే ఉన్నదనీ, దీని నుంచి రోగిని మాత్రమే కాకుండా రోగి కుటుంబాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని వారు తెలిపారు. వారి కుటుంబాలను రక్షించడానికి చర్యలు ప్రారంభించే ముందు రోగిని గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుందని వివరించారు. ఫుడ్ బాస్కెట్స్ టీబీ రోగుల కుటుంబ సభ్యులలో అంటువ్యాధులను ఎలా నిరోధించవచ్చనే దానిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తన అధ్యయనంలో పునరుద్ఘాటించింది. ఫుడ్ బాస్కెట్స్ అనేవి టీబీ మరణాలను కూడా తగ్గించగలవని వివరించింది. కేసులను నమోదు చేయకుండా ‘మేడిపండు చందంగా’ దేశంలోని టీబీని నిరోధించామని చెప్పుకునే ప్రయత్నాలు దేశంలో జరుగుతున్నాయని ఆరోగ్య, వైద్య నిపుణులు తెలిపారు. 2025 టీబీని నిర్మూలించేందుకు ప్రధాని మోడీ చేసిన వాగ్దానం గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ నిష్క్రియాత్మక తీరు ఆశ్చర్యం, ఆవేదన కలిగించక మానవని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో టీబీ మహమ్మారికి ప్రధాన కారణాలలో పోషకాహార లోపం ఒకటని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోషకాహారం విషయంలో దృష్టిని సారించాలని చెప్పారు. దేశంలో దాదాపు 80 శాతం మంది టీబీ రోగులు ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతారని అంచనా. అయితే ప్రభుత్వ నివేదికలో ప్రచురించిన డేటా ప్రకారం.. ఇది 30 శాతంగా ఉన్నది. ఈ వ్యాధిని 2012లో నోటిఫై చేసినప్పటికీ, ఆ తర్వాత దానిని తెలియజేయకపోవడం శిక్షార్హమైన నేరంగా మారింది. నోటిఫై చేయని ఒక టీబీ పేషెంట్ వారు అర్హులైన పోషకాహార స్టైఫండ్‌ను కోల్పోతారు. అలాగే కనీసం ఆరు నెలల యాంటీ ట్యూబర్‌క్యులర్ డ్రగ్స్‌ని రోగికి కట్టుబడి ఉండేలా చూసే ఆరోగ్య కార్యకర్తల సేవలకు సైతం దూరమయ్యే పరిస్థితులు ఉంటాయి. కేంద్రంలోని మోడీ సర్కారు టీబీ విషయంలో సీరియస్‌గా వ్యవహరించి వ్యాధిని నియంత్రించాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచించారు. రోగి, వారి కుటంబానికి అవసరమైన మందులు, పోషకాహారం, ఇతర వైద్య సేవలు సక్రమంగా అందేలా చూడాలని తెలిపారు. టీబీని నియంత్రించే చర్యలను పటిష్టం చేయకపోతే అది తీవ్ర రూపం దాల్చి మరింతగా నష్టాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు.