త్వరలో టీడీపీ బస్సు యాత్ర

– పార్టీ గెలుపే లక్ష్యం
– త్వరలో రూట్‌ మ్యాప్‌, షెడ్యూల్‌ ను ప్రకటిస్తాం
– శ్రేణులు సర్వం సిద్ధం కావాలి :తెలుగదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌
నవతెలంగాణ – హైదరాబాద్‌
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా త్వరలో బస్సు యాత్రను చేపట్టనున్నట్టు తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. బస్సుయాత్ర నిర్వహించేందుకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు . పార్టీలోని నాయకులందరిని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బస్సు యాత్రను విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. శనివారం టీడీపి రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ లో పార్లమెంటు నియోజకవర్గ పార్టీ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు, రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర విజయవంతం పై చర్చించారు . ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇప్పటికి ప్రజల గుండెల్లో బలంగా ఉంద న్నారు. నాయకులు వెళ్లిపోయినా క్యాడర్‌ అలాగే ఉన్నారని ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీని పునర్‌ నిర్మాణం చేయాలన్నారు. తద్వారా వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం బస్సు యాత్రను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ యాత్రలో అన్ని స్థాయిల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ తో పాటు షెడ్యూల్‌ ను ప్రకటిస్తామని చెప్పారు. బస్సు యాత్రను పార్లమెంట్‌ , అసెంబ్లీ నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు కషి చేయాలని సూచించారు. బస్సు యాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారుపై సలహాలు, సూచనలు చేసి అవసరమైన చోట మార్పులు, చేర్పులు సూచించాలని పార్లమెంటు నాయకులకు సూచించించారు
ప్రజా సమస్యలపై పోరాటాలకు సన్నద్ధం కండి
ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు నాయకులు, పార్టీ శ్రేణులతో సంసిద్ధం కావాలని జ్ఞానేశ్వర్‌ సూచించారు. స్థానిక సమస్యలతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్యకర్తలను సమీకరించి ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టి పార్టీకి ప్రజల మద్దతును కూడగట్టాలన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి ప్రచారం చేయాలని, ఈ దిశగా పార్టీని బలోపేతం చేసుకోవాలని పార్లమెంటు అబ్జర్వర్లను ఆదేశించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ భూపాల్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌, పార్లమెంటు అబ్జర్వర్లు.. పి.సాయి బాబా, గుల్లపల్లి ఆనంద్‌, అశోక్‌ కుమార్‌ గౌడ్‌, కూరపాటి వెంకటేశ్వర్లు, నెల్లూరి దుర్గాప్రసాద్‌, ఇల్లందుల రమేష్‌, మెట్టుకాడి శ్రీనివాస్‌, సుభాష్‌ యాదవ్‌, పి.గోపాల్‌ రెడ్డి, అలీ మస్కతి, కృష్ణమాచారి, సంజరు కుమార్‌, యాదా గౌడ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్‌, టీటీడీపీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌ బియ్యని సురేష్‌, పాల్గొన్నారు.