వరద బాధితులకు టీడీపీ చేయూత

TDP help flood victims– మృతుల కుటుంబాలకు రూ.10 వేలు
– నిత్యావసర సరుకులతో ప్రత్యేక వాహనాలు :కాసాని జ్ఞానేశ్వర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
భారీ వర్షాలతో వరద ముంపు ప్రాంతాల్లో నిరాశ్రయులైన ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. ప్రకతి విపత్తులో సర్వస్వం కోల్పోయిన బాధితులకు దుప్పట్లు, నిత్యావసర సరుకులను అందించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే తమ ఉద్దేశమన్నారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ నుంచి రాష్ట్రంలోని వరద ముంపు ప్రాంతాలైన భూపాలపల్లి, ములుగు జిల్లాల బాధిత ప్రజలకు టీడీపీ ఆధ్వర్యంలో పంపిణీ చేసే దుప్పట్లు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల వాహనాలను కాసాని పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వరద ముంపుతో ములుగు జిల్లాలోని ఏటూరునాగరం మండలం కొండాయి, మాల్యల, పసర, దొడ్డంపి, భూపాలపల్లి జిల్లాలోని మొరంచపల్లి గ్రామాలు పూర్తిగా దెబ్బతిని ప్రాణ, ఆస్తి నష్టం జరిగాయన్నారు. ఈ గ్రామాల్లో నిరాశ్రయులైన ప్రజలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకులు రెండు బందాలుగా ఏర్పడి స్థానిక నాయకులు, శ్రేణులతో కలిసి వరద ముంపు బాధిత ప్రజలకు 15 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. నిత్యావసర సరుకుల్లో దుప్పట్లు, బియ్యం, ఉప్పు, పప్పు, మంచినూనె, మిరపకాయలు, చింతపండు ఉంటాయన్నారు. వరద ఉధృతిలో మరణించి న వారి కుటుంబాలకు రూ.10 వేల రూపాయలను అందించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం టీడీపీ రూ. 15 లక్షలను ఖర్చు చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ క్రమ శిక్షణ కమిటి సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, జాతీయ కార్యదర్శి కాసాని విరేష్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జక్కిలి ఐలయ్య, అజ్మీరా రాజు నాయక్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పొల్కంపల్లి అశోక్‌, నల్లగొండ, జహీరాబాద్‌ పార్లమెంట్‌ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్‌ రెడ్డి, పైడి గోపాల్‌ రెడ్డి, కార్యనిర్వహక కార్యదర్శి బిక్షపతి ముదిరాజ్‌, పుట్టి రాజు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.