– 9,979 మంది టీచర్లకు పదోన్నతులు
– అవి ఖాళీగానే ఉంటాయా? భర్తీ చేస్తారా?
– నిరుద్యోగ అభ్యర్థుల్లో టెన్షన్
– 5,089 పోస్టుల భర్తీ పట్ల వ్యతిరేకత
– సీఎం హామీ ప్రకారం 13,086 నింపాలంటూ డిమాండ్
– రెండో వారంలో డీఎస్సీ నోటిఫికేషన్!
– విద్యాశాఖ కసరత్తు వేగవంతం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘రాష్ట్రంలో 1,947 గెజిటెడ్ హెడ్మాస్టర్, 2,162 పీఎస్‌హెచ్‌ఎం, 5,870 స్కూల్ అసిస్టెంట్ కలిపి 9,979 ఉపాధ్యాయ పోస్టులకు పదోన్నతులు కల్పిస్తాం’.అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో చెప్పారు. అయితే ఆ పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యే 9,979 పోస్టులను భర్తీ చేస్తారా? లేదా?అన్నది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ ప్రకటిస్తామంటూ చెప్పడం పట్ల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే రెండుసార్లు విద్యాశాఖ సంచాలకుల కార్యాల యాన్ని ముట్టడించారు. పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు. అయినా వెనక్కి తగ్గడం లేదు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు 5,089 పోస్టుల భర్తీకి డీఎస్సీ వేస్తే అంగీకరించేది లేదంటూ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. అయితే 5,089 ఉపాధ్యాయ, 1,523 ప్రత్యేక ఉపాధ్యాయ (డిజెబుల్డ్) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వాటి భర్తీ కోసం పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తును వేగవంతం చేశారు. ఇప్పటికే జిల్లాల వారీగా, సబ్జెక్టుల వారీగా పోస్టులను ఖరారు చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ఖరారుపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2017లో 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసింది. అప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా లేదు. ఇంకోవైపు ఎస్టీ కోటా 6.6 శాతం ఉండేది. వారి జనాభా దామాషా ప్రకారం ఎస్టీ రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పది శాతానికి పెంచింది. డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఈడబ్ల్యూఎస్ కోటాను చేర్చడంతోపాటు ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్‌ను వర్తింపచేస్తున్నారు. ఈ దిశగా విద్యాశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుని డీఎస్సీ నోటిఫికేషన్‌ను సిద్ధం చేస్తున్నారు.
జనవరిలో డీఎస్సీ రాతపరీక్షలు?
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈనెల రెండో వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. నెలరోజులపాటు ఆన్ లైన్‌లో దరఖాస్తులను స్వీకరించాలని షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. ఈనెల 15న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాతపరీక్ష జరగనుంది. ఈ ఏడాది పేపర్-1కు 2,69,557 మంది, పేపర్-2 కు 2,08,498 మంది కలిపి 2,91,058 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈనెల 27న టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఇప్పుడు టెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు కూడా డీఎస్సీకి దరఖాస్తు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ దిశ గా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంకోవైపు 2017లో అక్టోబర్ 10న టీఆర్టీ నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసింది. అయితే 2018 ఫిబ్రవరిలో రాతపరీక్షలను నిర్వహించారు. అయితే ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ ఈనెల రెండో వారంలో విడుదల చేసే అవకాశమున్నది. ఈ లెక్కన డీఎస్సీ రాతపరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే అవకాశం లేకపోలేదు. వచ్చేనెల నాలుగు తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసే అవకాశమున్నది. ఇంకోవైపు జమిలి ఎన్నికలు జరుగుతాయంటూ చర్చ జరుగుతున్నది. ఏదేమైనా ఎన్నికలు రాబోతున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని డీఎస్సీ రాతపరీక్షల తేదీలను విద్యాశాఖ ఖరారు చేయనుంది.
ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులు అర్హులేనా?
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఎడ్ అభ్యర్థులు అర్హులేనా?అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇటీవల రాజస్థాన్ కేసులో సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు డీఎడ్ అభ్యర్థులే అర్హులని స్పష్టం చేసింది. అదే విషయాన్ని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) కూడా వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. దాని ప్రకారం ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నదో ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రభుత్వ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని లక్షలాది మంది బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.