ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు

Teachers
Community builders– విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేద్దాం
– తెలంగాణ బిడ్డలు ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దాలి
– గురుపూజోత్సవంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
– 142 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం
– ఈ’సారీ’ సీఎం కేసీఆర్‌ గైర్హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేద్దామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష ప్రకారం తెలంగాణ బిడ్డలు ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దాలని కోరారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈ ఏడాదీ సీఎం కేసీఆర్‌ గైర్హాజరయ్యారు. 142 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అవార్డులను ప్రదానం చేశారు. అంతకు ముందు ట్యాంక్‌బండ్‌పై ఉన్న మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి పూలమాలవేసి మంత్రి నివాళులర్పించారు. అనంతరం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యారంగ కుటుంబం చాలా పెద్దదనీ, కేజీ టూ పీజీ వరకు 30 లక్షల మంది విద్యార్థులతోపాటు 1.50 లక్షల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు. భగవంతుడు లేడనే నాస్తికులుంటారు కానీ గురువుల్లేరనే వారు ఉండబోరని చెప్పారు. నాస్తికులకూ గురువులుంటారని అన్నారు. అత్యంత గౌరవప్రదమైనది ఉపాధ్యాయ వృత్తి అని వివరించారు. ఉపాధ్యాయులు కారణజన్ములనీ, సమాజ నిర్మాతలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను తక్కువ చేసి మాట్లాడొద్దనీ, వారిని సానపడితే జాతిరత్నాలుగా తయారు చేయొచ్చని సూచించారు. సర్కారు బడుల బాగుకోసం సీఎస్‌ఆర్‌ నిధులను అడిగే పరిస్థితి ఉండేదన్నారు. కానీ సీఎం కేసీఆర్‌ మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మౌలిక వసతుల కల్పనకు రూ.7,289 కోట్లు ఖర్చు చేస్తున్నారని వివరించారు. ప్రాచీన కాలంలో గురుకులాలకు ఎంత ప్రాధాన్యత ఉందో, రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేసి కేజీ టూ పీజీ విద్య అందిస్తున్నామని చెప్పారు. అదే తరహాలో వసతుల కల్పనకు ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్లు కూడా పోటీపడుతున్నాయని అన్నారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామనడం సరైంది కాదన్నారు. 2017లో 8,792 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం డీఎస్సీ ద్వారా 5,089 పోస్టులను భర్తీచేస్తామని చెప్పారు. గురుకులాల్లో గతంలో 11 వేల పోస్టులను భర్తీ చేశామని వివరించారు. ప్రస్తుతం 12 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని అన్నారు. ఇక టీఎస్‌పీఎస్సీ ద్వారా మూడు వేల అధ్యాపక పోస్టుల భర్తీ చేస్తున్నామని చెప్పారు. మరో 3,896 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సర్వీసును క్రమబద్ధీకరించామని గుర్తు చేశారు.
ఉత్తమ పౌరులుగా తయారు చేసేది ఉపాధ్యాయులే : మహమూద్‌ అలీ
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేసేది ఉపాధ్యాయులేనని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. రాయిని శిల్పి శిల్పంగా ఎలా తయారు చేస్తారో సామాన్యమైన విద్యార్థులను ఉపాధ్యాయులూ అదే తరహాలో తీర్చిదిద్దుతారని చెప్పారు. విద్యారంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. తెలంగాణ వచ్చాక విద్యాభివృద్ధి కొనసాగుతున్నదని వివరించారు. బడుల్లో సౌకర్యాల మెరుగు కోసం మన ఊరు- మనబడి కార్యక్రమమే అందుకు నిదర్శనమని చెప్పారు. అయితే రంజాన్‌, క్రిస్మస్‌. దీపావళి పండుగలను కొంత మందే జరుపుకుంటారనీ, అన్ని మతాలు, వర్గాల వారు జరుపుకునే పండుగ గురుపూజోత్సవమని అన్నారు. సమాజంలో పోలీసులు, డాక్టర్లు, ఇంజినీర్లు ఎవరు తయారు కావాలన్నా ఉపాధ్యాయులతోనే సాధ్యమని చెప్పారు. ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉంటే సమాజం బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు సురభి వాణీదేవి, కూర రఘోత్తం రెడ్డి, ఏవీఎన్‌ రెడ్డి, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ చైర్మెన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ ఆయాచితం శ్రీధర్‌, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబ్రాది, వైస్‌ చైర్మెన్లు వి వెంకటరమణ, ఎస్‌కే మహమూద్‌, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, వివిధ వర్సిటీల వీసీలు డి రవీందర్‌, టి రమేష్‌, సిహెచ్‌ గోపాల్‌రెడ్డి, లక్ష్మికాంత్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.