నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బోధనా వైద్యుల డిమాండ్ల సాధన కోసం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) నిర్ణయించింది. ఆదివారం హైదరాబాద్‌లో ఆ సంఘం ఆధ్వర్యంలో అన్ని మెడికల్ కాలేజీల బాధ్యుల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం టీటీజీడీఏ నాయకులు డాక్టర్ జలగం తిరుపతిరావు ఒక ప్రకటన విడుదల చేశారు. చలో హైదరాబాద్ తేదీ, వేదిక నిర్ణయించి త్వరలోనే వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి తెలుపుతామని వెల్లడించారు. తమ సమస్యలను పరిష్కరించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు, ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినట్టు గుర్తుచేశారు. గతేడాది నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపినప్ప టికీ సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. దీంతో అనివార్య పరిస్థితిలో మెజారిటీ సభ్యుల సూచన మేరకు చలో హైదరాబాద్ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.